టైప్ 2 డయాబెటిస్ ఇప్పుడు అధిక శాతం మందిలో కనిపిస్తోంది. నలభై ఏళ్లు దాటగానే డయాబెటిస్ ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది. ఒకసారి వచ్చిందా అది జీవితాంతం కొనసాగే దీర్ఘకాలిక అనారోగ్యం అది. అందుకే రాకుండానే జాగ్రత్త పడాలి. వచ్చాక ఆహార నియంత్రణ, వ్యాయామం ద్వారా కంట్రోల్ చేసుకోవాలి తప్ప పూర్తిగా పోయే పరిస్థితి మాత్రం ఉండదు. చాలా మంది మాంసాహారుల్లో డయాబెటిస్ వచ్చిన వారు మటన్ తినకూడదనే భావన ఉంది. తింటే రోగం మరింత ముదిరిపోతుందని చెప్పుకుంటారు. ఇదెంత వరకు నిజమో? అధ్యయనాలు, వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 


మటన్ తినకూడదా?
మాంసాహారులకు ఇష్టమైన వంటకాల్లో మటన్ కర్రీ, మటన్ బిర్యానీ కచ్చితంగా ఉంటుంది. గొర్రె, మేక మాంసాలతో వీటిని తయారు చేస్తారు. అయితే టైప్ 2 డయాబెటిస్  ఉన్న వారు మటన్ వంటకాలను తినడం తగ్గించుకోవాలి. తరచూ తినడం వల్ల వారిలో మధుమేహం మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. వారానికోసారి, అది కూడా మితంగా తింటే ఏ సమస్యా ఉండదు. తిన్నాక నిద్రపోవడం వంటివి చేయకూడదు. మటన్ తిన్న రోజు కనీసం ఓ గంట నడక వంటివి చేయడం మంచిది. 


తింటే ఏమవుతుంది?
మటన్లో అధికంగా కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ రూపంలో పేరుకుపోతుంది. ఇది రక్తంలో చేరి చక్కెర స్థాయిలను పెంచుతుంది. అనేక అధ్యయనాలు రెడ్ మీట్, మటన్ వంటివి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని తేల్చాయి. డయాబెటిక్ రోగులు సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న మటన్ ను తినడం చాలా వరకు తగ్గించాలి. చికెన్, చేపలు, మొక్కలా ఆధారిత ఆహారాలు వారు తినవచ్చు. 


మటన్ తినాలనిపిస్తే వారం మొత్తం  కలిపి అరకిలో కన్నా ఎక్కువగా తినకూడదు. అలాగని ఒకే రోజు అధికంగా తిన్నా ప్రమాదమే. ఒకసారి తిన్నప్పుడు 50 గ్రాములుకు మించుకుండా చూసుకోవడం ఉత్తమం. డయాబెటిక్ రోగులు రోజూ వందగ్రాముల మటన్ తిన్నా మధుమేహం పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడుతూ తినడం మంచిది. వారు పూర్తిగా తినడం మానేస్తే ఎలాంటి నష్టమూ లేదు. 


చేపలు బెటర్
డయాబెటిస్ ఉన్న వారికి చేపలు చాలా మేలు చేస్తాయి. చేపలు రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి. కాబట్టి మటన్ కు బదులు చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వారానికి రెండు సార్లు చేపల కూర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. 



Also read: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే



Also read: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది