Kuppam Hotel Attack : కుప్పం మండలం పరిధిలోని బైపాస్ రోడ్డులో ఉన్న హర్షిత డాబాలో ఆదివారం సాయంత్రం స్థానిక కౌన్సిలర్ అనుచరులు బీభత్సం సృష్టించారు. హోటల్ వచ్చిన వ్యక్తులు భోజనం కావాలని అడిగారు. అప్పటికే హోటల్ లో భోజనం అయిపోవడంతో సదరు హోటల్ నిర్వాహకులు లేదని చెప్పడంతో మాకే భోజనం లేదని చెప్తావా అంటూ దాడికి దిగారు. ఈ దాడికి సంబంధిచిన వ్యవహారం మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో ఈ వీడియా ఒక్కసారిగా వైరల్ గా మారింది. తమ తప్పేమి లేకుండా అన్యాయంగా మాపై దాడి చేయడమే కాకుండా డాబాలోని కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెప్తున్నారు.
దాడి ఘటనపై చంద్రబాబు ట్వీట్
కుప్పంలో హోటల్‌పై వైసీపీ కౌన్సిలర్ అనుచరల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కుప్పంలో దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకురావడం దురదృష్టకరమన్నారు. హోటల్‌లో ఫర్నీచర్ ధ్వంసం చేసి మహిళలను బెదిరించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. కుప్పం బైపాస్ రోడ్డులోని ఓ దాబాలో వైసీపీ కౌన్సిలర్ అనుచరులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మరో కౌన్సిలర్ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు అంటున్నారు.
"కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం. ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించడంపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం.హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.