'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తన కంటూ ఒక స్థానం సంపాదించుకున్న కన్నడ క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి. ఆయన నటించిన తాజా సినిమా '777 చార్లి'. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైనది. మనిషికి, మూగ జంతువు (కుక్క) కు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో సినిమా రూపొందింది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.


అనగనగా ఒక యువకుడు... అతడి పేరు ధర్మ. తాను చేసేది కరెక్ట్ అని అతడు అనుకుంటాడు. కానీ, చూసే వాళ్ళకు అది రాంగ్ అనిపిస్తుంది. 'మనిషివేనా నువ్వు' అని ఒకరు తిడితే... 'వాడు జీవితంలో బాగుపడడు' అని ఒక ముసలాయన అని తేల్చేస్తారు. 'వాడికి పెళ్ళాం పిల్లలు ఉంటే తెలిసుండేది' అని ఇంకొకరు అభిప్రాయ పడతారు. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవలు, ఇడ్లీ, సిగరెట్, బీర్... ఇవే ధర్మ జీవితం. 'ఇంత దరిద్రుడిని కుక్క కూడా పట్టించుకోదు' అని కాలనీలో ఓ మహిళ  తిడతారు. అటువంటి ధర్మ జీవితంలోకి ఒక కుక్క వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అతడి జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? అతడిని కుక్క ఎలా మార్చింది? అనేది సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.


ఫ్యాక్టరీ, కాలనీలో ఎప్పుడూ గొడవలతో ఉన్న ధర్మ జీవితం... కుక్క వచ్చిన తర్వాత దేశ సరిహద్దుల వరకూ వెళ్ళినట్టు ట్రైలర్ లో చూపించారు. అందుకు కారణం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


Also Read: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?






క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో జూన్ 10న '777 చార్లి' సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి శెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి కిర‌ణ్ రాజ్‌.కె దర్శకత్వం వహించారు. జి.ఎస్‌. గుప్తా, ర‌క్షిత్ శెట్టి నిర్మించారు. నోబిన్ పాల్‌ సంగీతం అందించారు. 


Also Read: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?