తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇతర పార్టీలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అతి దగ్గరనే మరో కార్యాలయం ఎందుకని.. అందు కోసం అత్యంత ఖరీదైన భూమిని ఎలా కేటాయింప చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకత్వం ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించింది. 33 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. జిల్లాల్లోనూ ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే  హైదరాబాద్ జిల్లాకు ఇంత వరకూ కేటాయించలేదు. ఇటీవల ఆ పార్టీ దరఖాస్తు చేసుకోవడంతో బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట మండలం/గ్రామం, ఎన్బీటీ నగర్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 వద్ద సర్వే నంబర్‌ 18/పీ, 21/పీలో ఈ స్థలం ఉంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌  ఉత్తర్వులు జారీ చేశారు.  హైదరాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌   9న ప్రతిపాదనలు పంపగా 10న సీసీఎల్‌ఏ ఆమోదముద్ర వేసింది.అయితే ఉచితంగా కాదని..ధరను ఖరారు చేసే ప్రక్రియను పెండింగ్‌లో ఉంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. వంద కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.


ఉత్తర్వులు వెలుగులోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 





ఈ అంశంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 





భారతీయ జనతాపార్టీ నేతలు కూడా ఇవే విమర్శలు చేస్తున్నారు. దళితులకు పంచడానికి లేని భూమి టీఆర్ఎస్ కార్యాలయాలకు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఆ 





టీఆర్ఎస్ ఆఫీస్‌కు స్థల కేటాయింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. దీంతో ఇతర పార్టీల నేతలు మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. త్వరలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలనే ఆలోచనలో ఇతర పార్టీలు ఉన్నాయి. ఎక్కువ కాలం మౌనంగా ఉండలేమని.. దీనిపై సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.