గూగుల్ ఇటీవలే తన పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రోల్లో అందించిన టెన్సార్ ప్రాసెసర్‌నే ఇందులో కూడా అందించారు. ఇప్పుడు వేర్వేరు దేశాల్లో ఈ ఫోన్ ధర ఎంత ఉండనుందో కంపెనీ ప్రకటించింది.


అయితే మనదేశంలో ఎంత ఉండనుందనే విషయం మాత్రం గూగుల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ధర అన్ని దేశాల కంటే జపాన్‌లో తక్కువగా ఉంది. జపాన్‌లో దీని ధర 53,900 యెన్‌లుగా (రూ.32,400) నిర్ణయించారు. ఇక అమెరికాలో ఈ స్మార్ట్ ఫోన్ ధర 449 డాలర్లుగా (సుమారు రూ.34,800) ఉంది. చాక్, చార్‌కోల్, సేజ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. జులై 21వ తేదీన దీని సేల్ ఆన్‌లైన్‌లో జరగనుంది. జులై 28వ తేదీన స్టోర్లలో అందుబాటులోకి రానుంది. అయితే మనదేశంలో ధర ఎంతో ఇంకా ప్రకటించలేదు కాబట్టి సేల్ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.


ఈ ఫోన్ ధర కెనడాలో 599 కెనడియన్ డాలర్లుగానూ (సుమారు రూ.35,900), యూకేలో 399 పౌండ్లుగానూ (రూ.37,900) నిర్ణయించారు. మన పొరుగున ఉన్న సింగపూర్‌లో దీని ధరను 749 సింగపూర్ డాలర్లుగా (సుమారు రూ.41,700) ఉంది. ప్రపంచం మొత్తం మీద ఈ ఫోన్ ధర ఇక్కడే ఎక్కువ.


గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 6ఏ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ అందించింది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!