మన ఇళ్లల్లో టమాటో లేనిదే ఏ వంటా పూర్తవ్వదు. పచ్చడి నుంచి బిర్యానీ వరకు అన్నింట్లోనూ టమాటో ముక్క పడాల్సిందే. టమాటో ఆరోగ్యానికే మంచిదే. దీనివల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. లైకోపీన్ అని పిలిచే అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఈ రెండింటి కోసమే మనం టమాటోలను తింటాం. కానీ ఏవైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అతిగా తింటే ఏదో ఒక ప్రమాదం పొంచే ఉంటుంది. అలాగే టమాటోలు కూడా అధికంగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
ఎసిడిటీ
టమాటోలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే అవి పుల్లగా ఉంటాయి. వాటిని అతిగా తినడం వల్ల గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ కలగచ్చు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవాళ్లు టమోటాలను తక్కువగా తినాలి.
చర్మం రంగుమారడం
టోమాటోలు అధికంగా తినడం వల్ల చర్మ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇది లైకో పెనడెర్మియా అనే పరిస్థితిని కలిగిస్తుంది. రక్తంలో లైకోపీన్ అధికంగా చేరి, చర్మం రంగు మారడం జరుగుతుంది. రోజుకు 75 మిల్లీ గ్రాముల లైకోపీన్ కు మించి తీసుకోకపోవడం మంచిది.
అలెర్జీ
టమాటోలలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఎక్కువైతే దగ్గు, తుమ్ములు, చర్మంపై దద్దుర్లు, గొంతులో దురద వంటి అలెర్జీలు కలుగుతాయి. మీకు ఇలాంటి అలెర్జీలు ఉన్నట్లయితే టమాటోలు తగ్గించండి.
కీళ్ల నొప్పులు
టమాటోల్లో సొలనిన్ అనే ఆల్కాలాయిడ్ ఉంటుంది. ఇది కీళ్లవాపు, నొప్పిని కలిగిస్తుంది. ఈ కూరగాయలను అధికంగా తినడం వల్ల కణజాలాల్లో కాల్షియం పేరుకుపోయే ప్రమాదం పెరిగిపోతుంది. మీకు కీళ్ల నొప్పులు ఉంటే టమోటాలను చాలా తక్కువగా తినాలి.
కిడ్నీ స్టోన్స్
టమాటోలు అధికంగా తినేవారి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. టమాటోల్లోని కొన్ని సమ్మేళనాలు జీర్ణరసాల ద్వారా విచ్ఛిన్నం కావు. ఫలితంగా కాల్షియం, ఆక్సలేట్ శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల రాళ్లు ఏర్పడతాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో
Also read: పిల్లలకు నచ్చే స్నాక్ క్రిస్పీ కార్న్, చేయడం ఎంతో సులువు