రక్తపోటుని చెక్ చేసుకునే బీపీ మానిటర్ ఇప్పుడు ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటే అవసరమైనప్పుడు వారి బీపీ చెక్ చేసి సరైన చికిత్స అందిస్తున్నారు. ఇది ఉంటే తరచుగా హాస్పిటల్ కి వెళ్ళే అవసరం తగ్గుతుంది. కనిపించవు కానీ రక్తపోటు సమస్యలు చాలా ప్రమాదకరం. అందుకే ఇది పెరిగినా, తగ్గినా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. బీపీ మానిటర్ ఇంట్లో మనంతట మనమే చెక్ చేసుకునే విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే అత్యవసరం అయినప్పుడు ఎవరూ లేకపోయినా మన జాగ్రత్తలో మనం ఉంటాం.
దుస్తులపై కఫ్ పెట్టకూడదు
దుస్తులపై బీపీ కఫ్ ఉంచడం వల్ల రక్తపోటు దాదాపు 5-50 ఎంఎంహెచ్ జి యూనిట్లు పెరుగుతాయని డాక్టర్స్ సూచిస్తున్నారు. అందుకే బీపీ కరెక్ట్ గా తెలియాలంటే తప్పనిసరిగా మిషన్ చేతికి పెట్టుకునే ముందు దుస్తులు పైకి పెట్టుకోవాలి. అప్పుడే కఫ్ పెట్టుకుంటే సరైన బీపీ నమోదు అవుతుంది.
మాట్లాడకూడదు
రక్తపోటు తనిఖీ చేసే సమయంలో మాట్లాడకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏదైనా మాట్లాడటం లేదా చురుగ్గా వినడం వల్ల ప్రస్తుతం ఉన్న రక్తపోటు 10 mmHg వరకు వస్తుంది. ఇది బీపీ తప్పుగా రికార్డు అయ్యేలా చేస్తుంది.
చెయ్యి ఫ్రీగా ఉంచాలి
చేతిని బిర్రుగా పట్టుకుని ఉండకూడదు. గుండెకి సమానంగా చేతిని ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చెయ్యి పొజిషన్ సరిగా లేకపోతే సాధారణంగా ఉన్న రక్తపోటుకి అదనంగా 10 mmHg జోడిస్తుంది. అందుకే బీపీ చెక్ చేసే ముందు వైద్యులు చేతిని టేబుల్ మీద ఉంచమని చెప్తారు. దాని వల్ల గుండెకి సమానంగా చెయ్యి కూడా ఉంటుంది.
నిటారుగా ఉండాలి
వీపు, పాదాలు దృఢంగా, నిటారుగా ఉంచుకోవాలని చెప్తున్నారు. కూర్చునే భంగిమ సరిగా లేకపోతే రక్తపోటుకి అదనంగా 6.5 mmHg యూనిట్ల వరకు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎలా పడితే అలా కూర్చోవడానికి ఒప్పుకోరు. రక్తపోటుని పరీక్షించే సమయంలో అడ్డంగా కూర్చోకూడదు. ఇది సాధారణ రక్తపోటు స్థాయిలని 8 mmHg వరకు పెంచుతుంది.
బీపీ చూసే ముందు వీటిని తినొద్దు
మనం తీసుకునే ఆహారాలు కూడా బీపీ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే రక్తపోటుని కొలవడానికి కనీసం 30 నిమిషాల ముందు ఆహారం, ఆల్కహాల్, ధూమపానం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వ్యాయాయం లేదా స్నానం చేసిన వెంటనే కూడా బీపీ చెక్ చేసుకోకూడదు. ఆ టైమ్ లో బీపీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
బీపీ రీడింగ్ తెలుసుకోవడం ఎలా?
⦿ ఖచ్చితమైన బీపీ రీడింగ్ తెలుసుకోవాలని అనుకుంటే ఒక నిమిషం కంటే తక్కువ గ్యాప్ లో మూడుసార్లు బీపీని కొలవాలి.
⦿ 3 రీడింగ్ ల సగటు లెక్కించాలి
⦿ బీపీ చెక్ చేసే ముందు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. కఫ్ ని తప్పనిసరిగా పైకి పెట్టుకోవాలి
⦿ బీపీ చెక్ చేసుకునే ముందు మూత్రానికి వెళ్ళాలి
⦿ చెక్ చేసుకోవడానికి కనీసం 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి
⦿ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు దూరంగా ఉంచాలి
⦿ బీపీ చెక్ చేసుకోవడానికి ముందు టీ, కాఫీ, కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోవద్దు
Also Read: ఈ సుషీ తినాలనుకుంటే మీ నాలుగైదు నెలల జీతం పక్కన పెట్టుకోవాల్సిందే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.