పండగలు, సెలవలు వచ్చినప్పుడు సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈసారి పంద్రాగస్టు నేపథ్యంలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. తెలుగులో విడుదలైన చిరంజీవి ‘భోళాశంకర్’ మినహా.. ‘జైలర్’, ‘గదర్ 2’ సినిమాలు కలెక్షన్స్‌లో దుమ్ము రేపుతున్నాయి. అలాగే ‘ఓఎంజీ 2’ను కూడా ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.


‘జైలర్’ రూలింగ్..


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ‘జైలర్’, ‘గదర్ 2’, ‘ఓఎమ్‌జీ 2’, ‘భోళా శంకర్’, ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’, ‘ఓపెన్‌హైమర్’ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు ఇండియన్ బాక్సాఫీస్‌కు రూ.403 కోట్ల కలెక్షన్స్ తెచ్చిపెట్టాయని గణాంకాలు చెప్తున్నాయి. కేవలం ఆగస్ట్ 10 నుంచి 13 మధ్యలోనే.. అంటే ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 2 కోట్ల మంది ఇండియన్స్.. సినిమాలను చూడడానికి థియేటర్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక అన్ని సినిమాల్లో కలెక్షన్స్ విషయంలో ‘జైలర్’ టాప్ స్థానాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. విడుదలయినప్పటి నుంచి ‘జైలర్’ ఏకంగా రూ.162 కోట్లు కలెక్ట్ చేసింది. నాలుగు రోజుల్లో ‘జైలర్’.. 93 లక్షల టికెట్లను అమ్మింది. ఇక ఆగస్ట్ 15న టికెట్ల సంఖ్య, కలెక్షన్స్ సంఖ్య మరింత పెరగనుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.


‘జైలర్' తర్వాత ‘గదర్ 2’..


‘జైలర్’ విడుదలయిన ఒకరోజు తర్వాత థియేటర్లలోకి ఎంటర్ అయ్యింది సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’. ‘జైలర్’ కలెక్షన్స్‌కు అంత దగ్గరగా పోటీ ఇచ్చింది ‘గదర్ 2’ మాత్రమే. విడుదలయ్యి మూడు రోజులే అయినా.. ఈ చిత్రం రూ.152 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. మొదటి వీకెండ్‌లో ‘గదర్ 2’ను చూడడానికి దేశవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక హాలిడే సందర్భంగా ఆగస్ట్ 15న ‘గదర్ 2’ను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. అంతే కాకుండా ‘జైలర్’ను కూడా దాటి ‘గదర్ 2’ కలెక్షన్స్‌ను సాధిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. 


హిందీలో గత వారం విడుదలయిన సినిమాల్లో ‘గదర్ 2’ తన సత్తాను చాటుతుండగా.. ఆ తర్వాత స్థానాల్లో ‘ఓఎమ్‌జీ 2’, ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ ఉన్నాయి. ముందుగా అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎమ్‌జీ 2’ విడుదలకు ముందు నుండే కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసుకుంది. విడులదయిన మొదటి వీకెండ్‌లో ‘ఓఎమ్‌జీ 2’కు 20 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. మొత్తం దేశవ్యాప్తంగా రూ.47 కోట్లను కలెక్ట్ చేసింది. ఒక ‘ఓఎమ్‌జీ 2’ తర్వాత రేసులో నిలిచిన ‘భోళా శంకర్’ 16 లక్షల టికెట్లతో రూ.22 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అంతకు ముందు వీకెండ్‌లో విడుదలయిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’, ‘ఓపెన్‌హైమర్’ కూడా ఇంకా కొత్త సినిమాలతో పోటీపడుతూనే ఉన్నాయి. 


Also Read: ‘ప్రేమ్ కుమార్’ కథ అదే, విశ్వక్ సేన్ సినిమాతో పోలిక లేదు: దర్శకుడు అభిషేక్ మహర్షి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial