చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం వేచి చేసిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, 'విరూపాక్ష' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్, బాక్సాఫీస్  దగ్గర దుమ్మురేపింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 'విరూపాక్ష' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగించింది.

  


మళ్లీ కలవనున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్


తాజాగా 'విరూపాక్ష'  టీమ్ మళ్లీ కలిసి పని చేయనున్నట్లు తెలిపారు.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశాయి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు వెల్లడించారు. వీలైనంత త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన విషయాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ మూవీలో కూడా హీరోగా సాయి ధరమ్ తేజ్ కొనసాగుతాడా? లేదా మరో హీరోను ఎంపిక చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.






క్షుద్రపూజలు, చేతబడులు నేపథ్యంలో రూపొందిన 'విరూపాక్ష' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరక్టర్ సుకుమార్ దీనికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 


'విరూపాక్ష'తో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సాయి ధరమ్ తేజ్


'రేయ్' సినిమాతో హీరోగా పరిచయమైన సాయి ధరమ్ తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్ట పడుతూ వచ్చాడు. పలు చిత్రాలతో ఫర్వాలేదు అనిపించినా,  బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపిన సందర్భాలు లేవు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్ళకు 'విరూపాక్ష' చిత్రంతో 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు.  టైర్-2 హీరోలలో ఇప్పటి వరకూ మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, నిఖిల్ సిద్దార్థ, వైష్ణవ్ తేజ్ మాత్రమే సోలోగా 100 కోట్ల క్లబ్ లో చేరారు. సాయి ధరమ్ తేజ్ కూడా ‘విరూపాక్ష’తో ఆ లిస్టులో చేరిపోయాడు. జూబ్లీహిట్స్ కేబుల్ బ్రిడ్జి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన సాయి ధరమ్ తేజ్, ఈ చిత్రంలో ఫుల్ జోష్ లోకి వచ్చారు. రీసెంట్ గా తన మేనమామ పవన్ కల్యణ్ తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది.


Read Also: ‘టైటానిక్’లో కేట్ విన్స్‌లెట్ ధరించిన ఓవర్ కోటు వేలం - ధర తెలిస్తే షాకవుతారు