ఆగస్ట్ 18న ఎన్నో సినిమాలు థియేటర్లలో పోటీపడుతున్నాయి. కొత్త చిత్రాలతో పాటు రీ రిలీజ్ సినిమాలతో థియేటర్లు కలకలలాడనున్నాయి. అలా ఈ శుక్రవారం విడుదల అవుతున్న చిత్రాల్లో ‘ప్రేమ్ కుమార్’ కూడా ఒకటి. యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయిన సంతోష్ శోభన్.. మరోసారి ‘ప్రేమ్ కుమార్’తో అందరినీ ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించారు. పలు చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అభిషేక్ మహర్షి.. ఈ మూవీతో దర్శకుడిగా మారాడు. సినిమా విడుదలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉండడంతో అభిషేక్ మహర్షి ‘ప్రేమ్ కుమార్’ విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నారు కానీ..
అభిషేక్ మహర్షి, సంతోష్ శోభన్.. ఈ ఇద్దరు మంచి స్నేహితులు. సంతోష్ హీరోగా నటించిన దాదాపు ప్రతీ సినిమాలో అభిషేక్ ఉన్నాడు. అయితే కేవలం కమెడియన్‌గా మాత్రమే అభిషేక్ గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ అతడు ఇంతకు ముందు ఎన్నో సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడు. ‘పేపర్ బాయ్’ అనే సినిమాలో సంతోష్, అభిషేక్ కలిసి నటించారు. అదే సమయంలో వారు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నారని, కానీ అది చివరికి సినిమా అయ్యిందని అభిషేక్ బయటపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అభిషేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినా.. రైటర్‌గా రానిస్తున్నాడు. హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్.. ఇలా ప్రతీ ఒక్క దర్శకుడు తనపై ఎంతోకొంత ప్రభావం చూపించాడని అభిషేక్ తెలిపాడు.
‘ప్రేమ్ కుమార్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒక్కటేనా..?
ఇప్పటికే ‘ప్రేమ్ కుమార్’ నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్‌ను విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో పోలుస్తున్నారు ప్రేక్షకులు. దానిపై అభిషేక్ స్పందించాడు. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ చూసినప్పుడు తాను కూడా భయపడ్డానని, కానీ ఆ చిత్ర దర్శకుడితో మాట్లాడిన తర్వా త ‘ప్రేమ్ కుమార్’ చాలా భిన్నమైన కథ అని క్లారిటీ వచ్చిందని అన్నాడు. సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అతడి జీవితం గురించి చెప్పేదే ‘ప్రేమ్ కుమార్’ కథ అని బయటపెట్టాడు అభిషేక్.
ఆ సినిమాలే ఇన్‌స్పిరేషన్..
సంతోష్ శోభన్ ఒకసారి స్క్రిప్ట్ ఒప్పుకున్న తర్వాత దర్శకుడు ఏం చెప్తే అదే చేస్తాడని తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించాడు అభిషేక్ మహర్షి. శ్రీచరణ్ పాకాల లాంటి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ దగ్గర అసిస్టెంట్ లాగా పనిచేసిన అనంత్ శ్రీకర్‌ను ‘ప్రేమ్ కుమార్’కు సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమాలు తన ‘ప్రేమ్ కుమార్’ కథకు ఇన్‌స్పిరేషన్ అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఇక ‘ప్రేమ్ కుమార్’ కుటుంబ కథా చిత్రమని, అందులో తనతో పాటు తన భార్య శ్రీవిద్య కూడా గెస్ట్ రోల్స్ చేశామని తెలిపాడు. ‘ప్రేమ్ కుమార్’ లాంటి కామెడీ కథ తర్వాత ఒక సీరియస్ సినిమా చేస్తానని, కథ కూడా సెప్టెంబర్ వరకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని అన్నాడు.
Also Read: దళితులపై హీరో ఉపేంద్ర అనుచిత వ్యాఖ్యలు - కేసు నమోదు, ఆయన స్పందన ఇదీ!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial