చిన్నవయసులోనే గుండె పోటు బారిన పడిన వ్యక్తులను గురించి వింటూనే ఉన్నాం. అలాగే మెదడు స్ట్రోక్ కూడా ఎక్కువ మందిని వేధిస్తోంది. ఈ రెండూ ప్రాణాంతక పరిస్థితులే వీటిని రాకుండా అడ్డుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఓ చిన్న పని చేస్తే చాలు గుండెపోటు, మెదడు స్ట్రోక్ రాకుండా 70 శాతం అడ్డుకోవచ్చు. గుండెకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు గుండె పోటు వస్తుంది, మెదడుకు రక్తం,ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఈ రెండూ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే మీరు కంటి నిండా నిద్రపోవాలి. రోజుకు ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ముఖ్యంగా రాత్రి నిద్ర.
కేవలం మంచి నిద్ర మిమ్మల్ని సగం రోగాల నుంచి కాపాడుతుంది. అరకొరగా నిద్రపోయేవారిలో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉండి, చాలా రోగాలు త్వరగా దాడి చేస్తాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నిద్ర ఒక్కటే దారి. చికిత్స కంటే నివారణ ముఖ్యమని మీరు వినే ఉంటారు. చక్కగా నిద్రపోతే చికిత్స వరకు వెళ్లే పరిస్థితులు తగ్గుతాయి. అనేక రోగాలకు నివారణ మార్గం కంటి నిండా నిద్ర మాత్రమే.
అధ్యయనం ఇలా...
అధ్యయనంలో భాగం యాభై ఏళ్లు నిండిన 7203 మంది ఆరోగ్య వంతమైన వ్యక్తులను పదేళ్ల పాటూ గమనించారు. వారు ఎంత సేపు నిద్రపోతున్నారు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనేదాన్ని స్కోర్ చేశారు. అంటే సున్నా నుంచి అయిదు మార్కుల రూపంలో ఇవ్వమన్నారు. ఎక్కువమందికి 3 నుంచి 4 మార్కులు వస్తే, 10 శాతం మంది మాత్రమే మంచి ఫలితాలు చూపించారు. అంటే కేవలం పదిశాతం మంది మాత్రమే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట. వీరు గుండె పోటు, స్ట్రోక్ బారిన పడే ప్రమాదం 75 శాతం తక్కువగా ఉన్నట్టు నిపుణులు నిర్ధారించారు.
నిద్ర గుండె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?
ఈ అధ్యయనంతో నిపుణులు ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర తప్పనిసరి అని చెప్పాలనుకున్నారు. దాన్ని నిరూపించారు కూడా. రాత్రి ఎనిమిది గంటల పాటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల శరీరం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకుంటుంది, అలాగే రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటు పెరగకుండా ఉంటుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. తగినంత నిద్ర లేకపోతే ఒత్తిడి హార్మోన్లు విడుదలై పోతాయి. అవి మెదడులో ఇన్ ప్లమ్మేషన్‌కు గురవుతాయి. దాని వల్లే ఓపిక, సహనం తగ్గిపోయి కోపం వచ్చేస్తుంది. రక్తపోటు కూడా పెరిగిపోతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
Also read: గుడ్డు కారం ఇలా చేసుకుని తింటే అదిరిపోతుంది
Also read: అద్భుతగుణాలున్న ఈ పుట్టగొడుగులు మద్యం అలవాటును మానిపించేస్తాయి, పరిశోధనలు సక్సెస్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.