గుడ్డుతో చేసే వంటకాలంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది వెజిటేరియన్లు గుడ్డు తింటారు. రోజుకో గుడ్డు తినమని కేంద్రప్రభుత్వాలు, వైద్యులు కూడా సిఫారసు చేస్తున్నారు. గుడ్డుతో చేసే టేస్టీ వంటకం గుడ్డు కారం. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను
గరం మసాలా - ఒక స్పూను
ఎండుకొబ్బరి పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు టీస్పూను
కరివేపాకులు - ఒక రెమ్మ
తరిగిన కొత్తిమీర - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే నిలువుగా గాట్లు పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. కళాయిలో నూనె వేసి వేడెక్కాక కోడిగుడ్లను వేయాలి. పసుపు, కారం, చిటికెడు ఉప్పు కూడా వేసి వేయించాలి.
4. రంగు మారేవరకు వేయించి పక్కకు తీసుకుని పెట్టుకోవాలి.
5. మిగిలిన నూనెలో ఉల్లిపాయ రుబ్బును వేసి వేయించాలి.
6. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టే వేసి వేయించాలి.
7. అందులో గరం మసాలా పొడి, కొబ్బరి పొడి కూడా వేయించాలి.
8. ఇప్పుడు గుడ్లు కూడా వేసి కలపాలి.
9. రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
10. దించే ముందు కొత్తిమీర చల్లాలి. అంతే గుడ్డు కారం రెడీ అయినట్టే.
రోజుకో గుడ్డు తింటే...
ఉడకబెట్టి వండే గుడ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే కొలెస్ట్రాల్ గుండె సంబంధిత రోగాలకు కారణం కాదని ఇప్పటికే హార్వర్డ్ హెల్త్ ప్రకటించింది. గుడ్డు తినడం వల్ల గుండెకు ఎలాంటి ముప్పు ఉండదు. దీనిలో విటమిన్ సి, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. గుడ్డులోని ప్రొటీన్లు మన శరీరానికి చాలా అవసరం. గుడ్డు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇతర ఆహారం తినాలనిపించదు. తద్వారా బరువు కూడా తగ్గొచ్చు. స్త్రీలు కచ్చితంగా గుడ్డును రోజూ తినాలి. ముఖ్యంగా గర్భిణిలు, బాలింతలు తినడం వల్ల వారికి శక్తితో పాటూ, పాలు కూడా ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలో హార్మోన్లు విడుదలకు గుడ్డులోని పోషకాలు అవసరం. కంటి ఆరోగ్యానికి కూడా గుడ్డులోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లూటిన్, జియాంక్సతిన్ ఉంటాయి. ఇవి కంటిచూపును కాపాడుతుంది. కోడిగుడ్లలో బి12 ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు వృద్ధికి మేలు చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగపడేలా చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Also read: గసగసాలు వాడడం మానేస్తే మీ ఆరోగ్యానికి ఎంత నష్టమో తెలుసా?
Also read: అద్భుతగుణాలున్న ఈ పుట్టగొడుగులు మద్యం అలవాటును మానిపించేస్తాయి, పరిశోధనలు సక్సెస్