ఆసియా కప్ లో టీమిండియా ఇన్నింగ్స్ ను ఎవరు ప్రారంభిస్తారో టాస్ వేశాక అందరికీ తెలుస్తుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా వ్యాఖ్యానించాడు. విలేకర్ల సమావేశంలో అడిగిన ప్రశ్నకు సరదాగా స్పందించాడు. 


శనివారం విలేకర్ల సమావేశంలో పాల్గొన్న రోహిత్ కు పాకిస్థాన్ జర్నలిస్ట్ నుంచి ఓపెనింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి టీమిండియా కెప్టెన్ పై విధంగా బదులిచ్చాడు.  ఆదివారం టాస్ వేశాక ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఎవరు వస్తారో మీరే చూడండి అంటూ ఆ ప్రశ్నను దాటవేశాడు. తమను కూడా కొన్ని రహస్యాలు దాచుకోనివ్వండంటూ విలేకర్లతో సరదాగా అన్నాడు. తాము కొత్తవి ప్రయత్నించాలనుకుంటున్నట్లు చెప్పాడు. వాటిలో కొన్ని పనిచేస్తే.. మరికొన్ని అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవచ్చని అన్నాడు. అయినా ప్రయత్నించడంలో తప్పు లేదని, అవకాశం వచ్చిన ప్రతిసారి కొత్త ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశాడు. 


గత కొంతకాలంగా భారత్ ఓపెనింగ్ లో కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. ఒకసారి పంత్, మరోసారి సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపుతోంది. రెగ్యులర్ గా రోహిత్ తో పాటు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. అయితే రాహుల్ గాయం కారణంగా దూరం కావటంతో టీమిండియా కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా రోహిత్ కు ఆ ప్రశ్న ఎదురైంది.


ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆసియా కప్ కు అందుబాటులో ఉన్నాడు. మరి రోహిత్ తో పాటు అతను ఓపెనింగ్ చేస్తాడా లేక మరెవరినైనా టీం పంపిస్తుందా అనేది కాసేపట్లో తేలనుంది. భారత్, పాక్ దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. 7 గంటలకు టాస్ పడనుంది.