చిన్న, గుండ్రంటి విత్తనాలు గసగసాలు. మసాలా కోవకే చెందుతాయివి. ఒకప్పుడు మాంసాహారం వండాలంటే కచ్చితంగా ఇవి ఉండాల్సిందే. కానీ ఇప్పుడు వీటి వాడకం చాలా తగ్గిపోయింది. ఎవరో తప్ప వీటిని ఇంట్లో నిత్య ఆహారంగా వాడుతున్నవారు చాలా తగ్గిపోయారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటి వాడకం తగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేజార్చుకుంటున్నారు. ఈ విత్తనాల నుంచి తీసే నూనె కూడా చాలా ప్రయోజనకరం. వీటిలో శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
గుండెకు మేలు
ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడమే కాదు, ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. గసగసాల్లో మాంగనీస్, కాపర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గసగసాల నుంచి వచ్చే నూనెలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. గుండె పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో మోనో, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజూ వంటల్లో అర స్పూను గసగసాలు వాడడం మంచిది.
శరీరంలో కలిగే నొప్పిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. వీటిలో ఉండే మోర్ఫిన్, కోడైన్, ఆల్కలాయిడ్ సమ్మేళనాలు నొప్పిని తగ్గించేందుకు సాయపడతాయి. అలాగే నిద్ర వచ్చేలా చేస్తాయి. కానీ గసగసాలు నీటిలో కడిగాక మాత్రమే వండాలి. వాటిపై ఉండై కలుషితాలు తినడం చాలా ప్రమాదకరం. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను కాపాడతాయి. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ పొట్టలోని మంచి బ్యాక్టిరియాను పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడేందుకు సహాయపెడతాయి. కణాల నష్టం జరగకుండా అడ్డుకుంటాయి.
Also read: పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? ఇలా అయితే వారిలో మానసిక సమస్యలు రావచ్చు
Also read: అద్భుతగుణాలున్న ఈ పుట్టగొడుగులు మద్యం అలవాటును మానిపించేస్తాయి, పరిశోధనలు సక్సెస్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.