Car Drowned in Brook: ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా విషాదం జరిగింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సంపతికోట సమీపంలోని వాగులో ఆర్ధరాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా... అందులో ఒకరు మృతి చెందారు. కారు గల్లంతైన సమయంలో వారి పెట్టిన కేకలు విన్న స్థానిక ప్రజలు.. లైట్లు, తాళ్లతో ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మిగతా నలుగురిని కాపాడారు.
యువతి మోనిక మృతి..
జిల్లాలోని కొత్తకోట మండలం తోకలపల్లెకు చెందిన రమణ (45), ఆయన భార్య ఉమాదేవి(37), కూతురు మౌనిక(22), తమ్ముడు శ్రీనివాసులు ( 39) తోపాటు డ్రైవర్.. బెంగళూరుకు వెళ్లారు. ఉమాదేవికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వీరంతా ఆస్పత్రికి వెళ్లి చూపించి ఇంటికి తిరిగి వస్తున్నారు. అప్పటికే చాలా రాత్రి అయింది. కానీ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వాగులు, వంకలన్నీ పొంగుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్దతిప్ సముద్రం మండలం సంపతికోట సమీప వాగు వద్ద ఉద్ధృతి ఎక్కువైంది. అది గమనించిని డ్రైవర్ అటుగా వెళ్లడంతో... కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో వారంతా గట్టిగా అరవడంతో.. స్థానిక ప్రజలు అప్రమత్తం అయ్యారు. వెంటనే తాళ్లు, లైట్లతో ఘటనా స్థలం వద్దకు చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
మొత్తం నలుగురిని గంటల పాటు శ్రమించి క్షేమంగా బయటకు తీసుకురాగలిగారు. కానీ రమణ కూతురు మాత్రం వాగులో కొట్టుకుపోయింది. దీంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహం కోసం గాలించగా ఈరోజు ఉదయం లభ్యం అయింది. పోస్టు మార్టం నిమిత్తం మోనిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన ఆరోగ్యాన్ని చూపించుకునేందుకు వెళ్లడం వల్లే తన కూతురు ప్రాణాలు పోయాయని ఉమాదేవి ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
నెల రోజుల కిందట ఆరుగులు విద్యార్థులు బలి!
అనకాపల్లి డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు సీతాపాలెం బీచ్ కు వచ్చారు. కాలేజీలో పరీక్షలు ముగియడంతో విద్యార్థులు బీచ్ కు వచ్చారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు స్నానానికి బీచ్ లో దిగారు. మిగిలిన విద్యార్థులు ఒడ్డునే కూర్చుని చూస్తున్నారు. ఒక్కసారిగా భారీగా అలలు రావడంతో ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ప్రమాదాన్ని గమనించిన ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు ఒక విద్యార్థిని రక్షించారు. కానీ అప్పటికే అతడు నీళ్లు తాగడంతో చికిత్సకోసం అనకాపల్లి ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఈ ప్రమాదంలో వీరిలో నర్సీపట్నానికి చెందిన పవన్(19) మృతి చెందాడు. ప్రాణాపాయంలో ఉన్న సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని మత్స్యకారులు రక్షించారు. ఈ ప్రమాదంలో గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకు చెందిన సతీశ్, చూచుకొండకు చెందిన గణేశ్, యలమంచిలికి చెందిన చందూ సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన మరో ఐదుగురి కోసం పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు తీవ్రంగా గాలించగా.. మరుసటి రోజు మృతదేహాలు లభ్యం అయ్యాయి.