తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆగస్టు 27న విడుదల చేశారు. మొత్తం నాలుగు రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 125 మంది ప్రొఫెసర్లు ఈ పుస్తకాలను రూపొందించడంలో అహర్నిశలు పనిచేశారు. ఈ పుస్తకాలు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ పుస్తకాలు త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
పుస్తకాలు ఇవే..
* భారతదేశ చరిత్ర–సంస్కృతి,
* భారతీయ సమాజం–రాజ్యాంగం, పరిపాలన
* ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి,
* తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర అవతరణ
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారని చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. స్టడీ మెటీరియల్ యాప్ ద్వారా విద్యార్థులకు అందించాలన్నారు.
టీహబ్, వీహబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని మంత్రి తెలిపారు. అందుకే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో లక్షా 55 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పోటీ పరీక్షల పుస్తకాలు వెలువడటం గురించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి స్పందించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌కు అనుగుణంగా 125 మంది ప్రొఫెసర్లు 4 రకాల పుస్తకాలను రూపొందించారని తెలిపారు.