ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 30 నుంచి 79 ఏళ్ల మధ్యగల వారిలో దాదాపు 128 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. వారిలో మూడింట రెండొంతుల మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే నివసిస్తున్నారు. కేవలం ఈ అధిక రక్తపోటు కారణంగా వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడి ఏటా 75 లక్షల మంది మరణిస్తున్నారు. ఆ మరణాల్లో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్యే అధికం. ఆహార మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ అకాల మరణాలను అడ్డుకోవచ్చు. సెప్టెంబర్లో అమెరికాలోని శాన్‌డియాగోలో జరిగిన ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హైపర్‌టెన్షన్ సైంటిఫిక్ సెషన్స్ 2022’లో ఒక నివేదికను సమర్పించారు వైద్య నిపుణులు. అందులో Dash డైట్‌ను పాటించడం ద్వారా కేవలం అమెరికాలోనే 15,000 మంది పురుషులు, 11,000 మంది మహిళలు గుండె పోటు బారిన పడకుండా జాగ్రత్తపడినట్టు వివరించారు. ఈ డైట్ ద్వారా అధిక రక్తపోటు వల్ల వచ్చే గుండె పోటును అడ్డుకోవచ్చని ఆ నివేదిక తేల్చింది. 


రక్తపోటు దశలు ఇలా ఉంటాయి...
దశ 1 రక్తపోటు — 130-139 సిస్టోలిక్/80-89 డయాస్టొలిక్
దశ 2 రక్తపోటు - 140 కంటే ఎక్కువ సిస్టోలిక్/90 డయాస్టొలిక్ కంటే ఎక్కువ
అధిక రక్తపోటు - 180 కంటే ఎక్కువ సిస్టోలిక్/120 డయాస్టొలిక్ కంటే ఎక్కువ
పైన ఇచ్చిన రక్తపోటు రీడింగులను బట్టి మీరు ఏ దశలో ఉన్న నిర్ణయించుకోవచ్చు. ఏ దశలో ఉన్నా కూడా Dash డైట్ పాటించడం ఉత్తమం. 


DASH డైట్ అంటే ఏమిటి?
DASH డైట్ అనేది 1990లలో ప్రారంభమైందని చెబుతారు. DASH అంటే ‘Dietary Approaches to Stop Hypertension’. అంటే హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి పాటించే ఆహారవిధానాలు అని అర్థం. దీన్ని కేవలం ప్రత్యేకంగా అధికరక్త పోటును అడ్డుకుని, తద్వారా గుండెపోటును రాకుండా చేయడానికి తయారుచేశారు. 


ఏం తినాలి?
ఈ డైట్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకుంటారు. ఇవన్నీ కూడా రక్తపోటును తగ్గించడానికి ప్రయత్నించే పోషకాలే. అలాగే ఈ డైట్ లో  సంతృప్త కొవ్వులు ఉంటే ఆహారం, మాంసం, నూనెల వినియోగం తక్కువగా ఉంటుంది. దీనిలో కూరగాయలు, పండ్లు అధికంగా తినమని సూచిస్తారు. కొవ్వు రహిత అంటే వెన్న తీసిన పాలు మాత్రమే తాగాలి. చేపలు, బీన్స్, నట్స్ అధికంగా తీసుకోవాలి. నూనూ వాడకాన్ని తగ్గించాలి. వెజిటబుల్ నూనెలను మాత్రమే కొంచెంగా వాడాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్లు, ఓట్స్, పెరుగు తినవచ్చు. అయితే గుడ్లు అధికంగా తినకూడదు చాలా పరిమితంగా తినాలి. తక్కువ సోడియాన్ని తీసుకోవాలి. సోడియం అధికంగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. 


DASH డైట్‌కి మారడం వల్ల సంవత్సరానికి సుమారు 2,900 మరణాలను నివారించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు DASH డైట్ కి మారడం ఉత్తమం. 


Also read: ఆ వయసు దాటిన ప్రతి కరోనా బాధితుడిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువ


Also read:  మనదేశంలో మోడల్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా? ఆ విషయంలో అమ్మాయిలే టాప్