ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక కూడా ఎవరికీ లేదు. కొన్ని వ్యాధులు పైకి కనిపిస్తే మరికొన్ని వ్యాధులు కంటికి కనిపించకుండా ముదిరే వరకు వాటి గురించి తెలియడం.అలాంటిదే అల్జీమర్స్ కూడా. ఇది సోకినట్టు కూడా ఎవరికీ తెలియదు. వస్తువులు మర్చిపోవడం అనేది సహజంగా ఉండే లక్షణమే. అందుకే దీన్ని ఎక్కువ మంది కనిపెట్టలేకపోతున్నారు. కానీ అతిగా విషయాలు మర్చిపోతున్నారంటే మాత్రం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మీకు 65 ఏళ్లు దాటి ఉన్నా, కరోనా గతంలో వచ్చి తగ్గినా కూడా అల్జీమర్స్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అల్జీమర్స్ గురించి ప్రముఖ వైద్యులు వివరిస్తున్నారు. 


ఏమిటీ వ్యాధి?
అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనివడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీని బారిన పడిన వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటాయి. వ్యాధి సోకాక కొన్ని గంటల క్రితం జరిగిన విషయాలే మర్చిపోవడం, ఏమీ మాట్లాడమో మర్చిపోవడం వంటివి జరుగుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. చివరికి రోజు వారీ తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితులకు చేరుకుంటాడు. 


చికిత్స ఉందా?
మందులు వాడడం ద్వారా తాత్కాలికంగా దీని లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఇవి వ్యక్తులు కొంత కాలం పాటూ తమ పనులు తాము చేసుకునేలా చేస్తాయి. వైద్యులను సంప్రదిస్తే అల్జీమర్స్ ఏ స్థాయిలో ఉందో నిర్ణయించి చికిత్స చేస్తారు. 


ఎవరికి ఎక్కువ సోకుతుంది?
వయసుతో పాటూ వచ్చే సమస్యల్లో ఇదీ ఒకటి. కాకపోతే కరోనా వచ్చిన తగ్గిన వారిలో ఇది అధికంగా కనిపిస్తోంది. 65 ఏళ్లు దాటిన వారంతా జాగ్రత్తగా ఉండాలి. వారిలో ప్రతి 9 మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకుతున్నట్టు అంచనా. కొన్ని సార్లు 40 నుంచి 50 ఏళ్లలోపు వారిలో కూడా కనిపిస్తోంది.మధ్యవయసులో వారికి ఈ సమస్య రావడం ఒత్తిడి వల్ల, మానసిక కుంగుబాటు వల్ల కూడా కావచ్చు. ఇక మహిళల్లో మెనోపాజ్ సమయంలో కూడా కలగవచ్చు. 


సాధారణ జీవితం గడపవచ్చా?
అల్జీమర్స్ సోకినప్పటికీ ఆ వ్యక్తి చాలా సంవత్సరాల పాటు సాధారణ జీవితం గడపవచ్చు. గుండెను ఆరోగ్యకరంగా ఉంచే సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ మెదడుకు తగిన పనిపెట్టే అలవాట్లను కొనసాగించటం ద్వారా అల్జీమర్స్ వ్యాధిని తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చు. అయితే అల్జీమర్స్ ను ప్రారంభదశలోనే గుర్తించటం ఎంతో ముఖ్యం.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా అల్జీమర్స్ నుండి దూరంగా ఉండవచ్చు. అల్జీమర్స్‌ను నివారించడంలో సహాయపడటానికి వ్యాయామం చాలా ముఖ్యమైనది. వారానికి మూడు నుండి నాలుగు రోజులు 30 నిమిషాల పాటూ ఏరోబిక్ వ్యాయామం చేయడం మంచిది. సమతుల ఆహారం తీసుకోవటం, శరీర బరువును అదుపులో ఉంచుకోవటం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకమైన జీవనవిధానం మెదడును ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అల్జీమర్స్  వ్యాధితో గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి రాకుండా సహాయపడుతాయి. చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించటంవల్ల  మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలు బలపడి మెదడు చురుకుగా పని చేస్తుంది. 


Also read: పండుగలు వచ్చేస్తున్నాయ్, మొటిమలు త్వరగా మానిపోవాలంటే ఇవిగో చిట్కాలు


Also read: మనదేశంలో ర్యాంప్‌వాక్ చేసే మోడల్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా? ఆ విషయంలో అమ్మాయిలే టాప్