65 Roses Symptoms : హాయ్ నాన్న సినిమా చూసిన వాళ్లకి 65 రోజెస్ అంటే కొంత క్యూరియాసిటీ ఉంటుంది. ఆ సినిమాలో హైలెట్​గా నిలిచిన, నానికి కూతురిగా చేసిన పాపకు ఈ 65 రోజెస్ అనే వ్యాధి ఉంటుంది. అసలు ఈ వ్యాధి ఏంటి అనే విషయం ఎక్కువమందికి తెలియదు. ఇంతకీ ఈ వ్యాధి అసలు పేరేమిటి? దాని లక్షణాలు ఏమిటి? దేనివల్ల వస్తుంది? ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధిని 65 రోజెస్ అంటారు. దీని సంకేంతాలు, లక్షణాలు వ్యాధి తీవ్రత బట్టి మారుతూ ఉంటాయి. అదే వ్యక్తికి సమయం గడిచే కొద్ది లక్షణాలు తీవ్రం కూడా కావొచ్చు. లేదంటే పరిస్థితి మెరుగుపడవచ్చు. సాధారణంగా నవజాత శిశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధిని గుర్తిస్తారు. శిశువు పుట్టిన మొదటినెలలోనే ఈ సమస్యను గుర్తిస్తారు. అయితే యుక్తవసులో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. కానీ వ్యాధి లక్షణాలు యుక్త వయసులో ఎక్కువగా ఉండకపోవచ్చు. 


ఈ సమస్య కలిగి ఉన్నవారి చెమటలో ఉప్పు సాధారణ స్థాయికంటే ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ముద్దుపెట్టినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇతర సంకేతాలు, లక్షణాలు శ్వాసకోశ వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారిలో జిగట శ్లేష్మం ఊపిరితిత్తులలో పేరుకుపోయి ఉంటుంది. ఇది గాలిని తీసుకువెళ్లే గొట్టాలను మూసివేసి శ్వాస ప్రక్రియలను దెబ్బతీస్తుంది. 


వ్యాధి లక్షణాలు


సిస్టిక్ ఫైబ్రోసిస్​లో మందపాటి శ్లేష్మాన్ని విడుదల చేసే దగ్గు, గురక, లంగ్స్ ఇన్​ఫెక్షన్​లు, సైనసిటిస్, జీర్ణ క్రియ సమస్యలు, మలబద్ధకం వంటివి ఇబ్బంది పెడతాయి. మందపాటి శ్లేష్మం ప్యాంక్రియాస్ నుంచి చిన్న పేగులకు జీర్ణ ఎంజైమ్​లను తీసుకువెళ్లే గొట్టాలను నిరోధిస్తాయి. ఈ జీర్ణ ఎంజైమ్​లు లేకుండా పేగులు తినే ఆహారం నుంచి శరీరం పోషకాలను గ్రహించలేదు. 


చికిత్స


సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జన్యుపరమైన వ్యాధి. దీనికి ఇంకా ఎలాంటి నివారణ ఇప్పటివరకు కనిపెట్టలేదు. ఈ వ్యాధి ఊపిరితిత్తులు, క్లోమం, ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. వ్యాధితో బాధపడుతున్నవారిని నిరంతరం లంగ్స్ ఇన్ఫెక్షన్​లకు గురిచేస్తుంది. కాలక్రమేణా శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఇది ఆహారంతో సంబంధం లేకుండా ఆహారాన్ని జీర్ణం చేయడానికి, బరువు ఇబ్బందులు కలిగించి పరిస్థితిని కష్టతరం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స లేనప్పటికీ.. పలు చికిత్సలు శ్వాసనాళాల నుంచి శ్లేష్మాన్ని తొలగించడంలో ఇవి సహాయం చేస్తాయి. జీర్ణక్రియకు హెల్ప్ చేస్తాయి. వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తద్వార జీవన నాణ్యత పెరుగుతుంది. 


వారిలో వంధ్యత్వం..


సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్​మెంబ్రేన్ కండక్టెన్స్ రెగ్యులేటర్ శరీరంలో ప్రోటీన్ సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది. ప్రొటీన్ సరిగ్గా లేనప్పుడు అది క్లోరైడ్​ను సెల్​ ఉపరితలంపైకి తరలించడంలో సహాయం చేయదు. దీని వల్ల క్లోరైడ్ సెల్ నీటిని ఆకర్షిస్తుంది. దీనివల్ల వివిధ అవయవాలలో శ్లేష్మం మందంగా, జిగటగా మారుతుంది. వాయుమార్గాలను అడ్డగించి.. బ్యాక్టీరియాను బంధిస్తుంది. అంటువ్యాధులు, వాపు, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. ఇది కాలేయ, మధుమేహ వ్యాధులను కూడా ప్రేరేపిస్తుంది. ఈ సమస్య మగవారిలో ఉంటే వారికి వంధ్యత్వం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 


Also Read : పాలు తాగే పిల్లలకు త్వరగా ఫుడ్​ తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త