చేపలు తినాలంటే వాటిని వండడమే పెద్ద కష్టంగా భావిస్తారు ఎంతోమంది. అందుకే చికెన్, మటన్ కూరలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందులోను చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ రుచే వేరు. వాటిని తినేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చికెన్, మటన్ కన్నా చేపలే తినాలని సూచిస్తున్నారు. ఏదో ఒక రూపంలో చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని, వారంలో రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు.


చికెన్, మటన్ అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోతుందని, చేపలు తినడం వల్ల కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉండదని, పైగా ఎంతో ఆరోగ్యాన్నిస్తుందని వివరిస్తున్నారు. చేపలు తినడం వల్ల శరీరంలో డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. డిప్రెషన్ బారిన పడకుండా రక్షిస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి తగ్గించడంలో ముందుంటాయి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో మతిమరుపు సహజంగా వస్తుంది. కొందరికి సమస్య పెరిగి పెద్దదై అల్జీమర్స్‌గా మారుతుంది. అలాంటివారు చిన్న వయసు నుంచి చేపలను తినడం అలవాటు చేసుకుని ఉంటే ఆ సమస్య బారిన పడే ఛాన్సులు కూడా తగ్గుతాయి. అమెరికన్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఎవరైతే చేపలను అధికంగా తింటారో, వారు వయసు పెరిగాక మతిమరుపు వ్యాధి బారిన తక్కువగా పడినట్టు గుర్తించారు. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా చేపలు ముందుంటాయి.


చేపలు తరచూ తినేవారిలో దృష్టి సమస్యలు తక్కువగా వస్తాయి. వీటిని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఇవి కాపాడతాయి. గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్లు ఏర్పడకుండా కూడా ఇవి అడ్డుకుంటాయి. అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా అడ్డుకుంటాయి. పెద్ద పేగు, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్,  నోటి క్యాన్సర్ వంటివి రాకుండా కూడా ఇవి నిరోధిస్తాయి.


రుతుక్రమం సరిగ్గా లేని మహిళలు తరచూ చేపలు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారు కూడా చేపలను తరచూ తింటూ ఉండాలి. వీటిలో విటమిన్ ఇ ఉంటుంది. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ రెండు ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తాయి. 


Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం తినాలో చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం



Also read: ఎర్ర బెండకాయలు కనిపిస్తే కచ్చితంగా కొనండి, వీటిలో ఎన్నో పోషక విలువలు




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.