నవరసాల్లో ఏడుపు కూడా ఒకటి. కానీ ఏడిస్తే మాత్రం చిన్నచూపు. అమ్మాయిలు ఏడిస్తే ‘ఏడుపుగొట్టుది, పిరికిది’అంటూ ట్యాగ్‌లైన్లు. అదే అబ్బాయి ఏడిస్తే ‘మగాళ్లు ఏడుస్తారా? ఏడ్చే వాళ్లు మగాళ్లే కాదు’ అంటూ స్టేట్‌మెంట్లు. మరి ఎందుకు ఏడుపు అనే ఒక భావోద్వేగం? ఉపయోగం లేని ఒక భావాన్ని దేవుడు మనకెందుకిచ్చాడు?
ఏడుపే ముఖ్యం
నవ్వడం ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి ఏడుపు కూడా అంత ముఖ్యం. అందులోనూ మానసిక ఆరోగ్యానికి ఏడుపు అత్యవసరం. ఒత్తిడి, మానసిక సమస్యలు కంటికి కనిపించవు. వాటిని అనుభవించే వారికే తెలుస్తుంది. వాటి నుంచి త్వరితంగా ఉపశమనం పొందాలంటే... అద్భుతమైన మెడిసిన్ ‘ఏడుపు’.గుండెలోని బరువుని క్షణాల్లో తీసిపారేసే శక్తి ఉన్నది ఏడుపుకే. అందుకే భావోద్వేగాల్లో ఏడుపుకు చాలా ప్రాముఖ్యత ఉందంటున్నారు మానసిక శాస్తవేత్తలు.
ఏడుపు గదులు... న్యూట్రెండ్
మగవాళ్లు ఏడవకూడదు, ఆడవాళ్లు ఏడిస్తే మంచి జరుగదు... వంటి పాత చింతకాయ పచ్చడి వంటి స్టేట్ మెంట్లను సమాధి చేసేందుకు స్పెయిన్ ముందుకొచ్చింది. ఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో ‘క్రైయింగ్ రూమ్స్’ కట్టించింది. దీన్ని ఒక ప్రాజెక్టులా మొదలుపెట్టారు. దీని లక్ష్యం ఒక్కటే... ఏడుపు చుట్టూ అల్లుకున్న సామాజిక సంకెళ్లను తెగ్గొట్టడం, ప్రజలకు మానసిక ప్రశాంతతను అందించడం. అంతేకాదు తీవ్ర మానసిక వేదనతో బాధపడుతున్న వారికి ఇక్కడ సహాయ సహకారాలు కూడా అందుతాయి. మానసిక సమస్యలతో బాధపడేవారికి, తీవ్ర బాధలో ఉన్న వారికి తాము ఒంటరిగా లేమనే భావనను ఇస్తాయి ఈ క్రైయింగ్ రూమ్స్.
రెండు రకాల గదులు
అక్కడ రెండు రకాల గదులు ఉంటాయి. ఒకటి ఏడుపు గది. ‘ఎంటర్ అండ్ క్రై’ అని రాసి ఉంటుంది. అందులోకి వెళ్లి ఎంత సేపు కావాలంటే అంతసేపు, ఎంతబిగ్గరగా కావాలంటే అంత బిగ్గరగా ఏడవచ్చు. లోపలి శబ్ధం బయటికి రాదు. ఇక రెండోది ‘నాకు మానసిక ఆందోళన ఉంది’ అని రాసి ఉన్న గది. ఈ గదిలోకి వెళ్లే వారికి తోడు అవసరం. వారికి సాయం చేసేందుకు మానసిక నిపుణులు ఉంటారక్కడ.
బాధలు చెప్పుకోవచ్చు
ఎవరైనా మన బాధలు వింటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే అక్కడ ఆ సదుపాయం కూడా ఉంది. వీరి బాధలను వినేందుకు కొంతమంది ఫోన్లలో అందుబాటులో ఉంటారు. వారి ఫోన్ నెంబర్లు, ఫోను అక్కడ అందుబాటులో ఉంటుంది. వారిలో ఎవరో ఒకరికి ఫోను చేసి మనుసులోని బాధను చెప్పుకుని సాంత్వన పొందవచ్చు.
ఎందుకీ గదులు?
స్పెయిన్ ప్రభుత్వం లెక్కల ప్రకారం 2019లో దాదాపు 3,671 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశ జనాభాలో 5.8 శాతం మంది మానసికఆందోళనతో బాధ పడుతున్నారు. అందుకే అలాంటి వారికి ఉపశమనం కలిగించేందుకే స్పెయిన్ ప్రభుత్వం ఈ ఏడుపుగదులను ప్రవేశపెట్టింది.
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
Read also: భోజనం మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Read also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి