రాత్రి సుష్టుగా భోజనం చేసి నిద్రపోయినా కూడా అర్ధరాత్రి మెలకువ వచ్చి, ఏదైనా తినాలన్న కోరికలు మీలో కలుగుతున్నాయా? అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అర్ధరాత్రి తినాలన్న కోరికల వెనుక శాస్త్రీయంగా నిరూపితమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట తినాలనిపించేవి కూడా తీపి పదార్థాలు లేదా జంక్ ఫుడ్. ఇలా ఎందుకు జరగడానికి కారణాలు ఇవే.
ఆహారపు అలవాట్లు
పగటిపూట మీరు ఎలాంటి ఆహారం తింటున్నారు? శరీరానికి ఎలాంటి పోషకాహారాన్ని అందిస్తున్నారు? అనే విషయంపైనే రాత్రి సమయంలో ఆకలి పుట్టడం, జంక్ ఫుడ్ తినాలనిపించడం అనే కోరికలు ఆధారపడి ఉంటాయి. ఉదయం పూట తినే ఆహారంలో ప్రోటీన్లు తక్కువగా ఉంటే, అర్ధరాత్రి ఆకలి బాధ ఎక్కువవుతుంది. కాబట్టి దీన్ని పరిష్కరించడానికి సులువైన మార్గం అల్పాహారం, లంచ్‌లో పోషకాలు నిండి ఉండాలి. సమతుల్య భోజనాన్ని చేయాలి. అయితే రాత్రి మాత్రం తేలికపాటి భోజనంతో ముగించాలి. ఉదయం పూట ప్రోటీన్లు నిండుగా ఉన్న ఆహారం తింటే, రాత్రి మెలకువ రావడం, ఆకలి వేయడం అనేది జరగదు. కొంతమంది పిజ్జాలు, కూల్ డ్రింక్స్, చిప్స్ ఇలాంటి వాటితోనే ఎక్కువగా మధ్యాహ్న భోజనాన్నీ, అల్పాహారాన్నీ కానిస్తుంటారు. ఇలా చేయడంవల్ల అర్ధరాత్రి ఆకలి పెరిగిపోతుంది.
ఒత్తిడి
ఒత్తిడి వెనుక కారణాలు ఎన్నో. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా ఇలా అనేక అంశాల విషయంలో ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరచూ ఆకలి వేయడం ఒత్తిడిలో ఒక భాగమే. బాగా వేయించిన లేదా తీపి పదార్థాలను తినడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ రెండు రకాల ఆహారాలను దూరం పెడితే ఒత్తిడి తగ్గించడం సులువవుతుంది. ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఈటింగ్ డిజాస్టర్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అర్ధరాత్రి ఆకలి వేయడం అనేది ఒత్తిడితో సంబంధం కలిగి ఉంది. ఎవరైతే అధిక ఒత్తిడికి గురవుతారో వారు ఇలా అర్ధరాత్రి లేచి ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు.
నిద్ర సరిగా లేకపోవడం
రోజుకో సమయానికి నిద్రపోవడం అనేది ఒత్తిడిని పెంచుతుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అనేది ఆరోగ్యకరమైన దినచర్య. లేకుంటే నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య కలిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ చక్కెర లేదా కొవ్వు నిండిన ఆహార పదార్థాలు తినాలన్న కోరికను పెంచుతుంది. ఫిజియాలజీ బిహేవియర్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేమి ఆకలి హార్మోన్ అయినా గ్రెలిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పొట్ట నిండినట్టు అనిపించేలా చేసే లెఫ్టిన్ హార్మోన్ తగ్గిపోతుంది. కాబట్టి ఒకే సమయానికి నిద్రపోవడం, తగినంత నిద్ పోవడం శరీరానికి చాలా అవసరం.
ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల ద్వారా కూడా అర్థరాత్రి ఆకలి వేయకుండా అడ్డుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా వేపుళ్ళు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చాలా మంది బంగాళదుంపలతో చేసిన చిప్స్ తినేందుకు ఇష్టపడతారు. వాటికి బదులు రాగులు, జొన్నలు, మఖాన వంటి వాటితో చేసిన చిరుతిళ్లు తినేందుకు ప్రయత్నించాలి. పాప్‌కార్న్ తినొచ్చు. చాక్లెట్లు, కేకులకు బదులుగా పీనట్ బట్టర్, బెల్లంతో చేసిన చిరుతిళ్లు, పండ్లు, పెరుగు, చక్కెర లేని డార్క్ చాక్లెట్లు, యాపిల్స్ లాంటివి తినాలి. సోడా, కూల్ డ్రింకులకు బదులుగా నిమ్మరసం, తాజా పండ్ల రసాన్ని తాగాలి.
Also read: వాలెంటైన్స్ డే పార్టీకి ఏ రంగు లిప్‌స్టిక్ బెటర్? గార్జియస్ లిప్‌స్టిక్ షేడ్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.