Coffee and Lemon Diet : బరువు తగ్గడానికి చాలామంది సింపుల్ మార్గాలకోసం ఎదురు చూస్తుంటారు. అవన్నీ పూర్తి ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ.. ఎంతో కొంత మేరకు బరువు తగ్గడంలో కాస్త బెనిఫిట్స్ అందిస్తాయి. అలాంటి వాటిలో కాఫీ, నిమ్మకాయ కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గడంలో మార్పులు చూడవచ్చు అంటున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతారు కానీ.. కాఫీలో కూడా నిమ్మరసం కలిపి తాగొచ్చా?


కాఫీలో పాలు కలపకుండా బ్లాక్ కాఫీ చేసుకుని దానిలో నిమ్మరసం కలిపి తాగితే మంచిదంటూ కొందరు చెప్తున్నారు. బరువు తగ్గడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుందంటున్నారు. అయితే క్లినికల్ న్యూట్రిషన్​ జర్నల్​లో కాఫీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుందని ప్రచురించారు. 2023 జరిగిన అధ్యయనంలో కేవలం కాఫీ తీసుకోవడం గురించే రాశారు. అలాగే జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్​లో కేవలం నిమ్మకాయను బరువు తగ్గించే ఫుడ్​గా చెప్పారు కానీ.. కాఫీ, నిమ్మకాయ తాగితే బరువు తగ్గచ్చా? ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


బరువు తగ్గడానికి.. 


కాఫీ శరీరంలో శక్తిని పెంచి.. మెటబాలిజంను ప్రేరేపించి బరువు తగ్గేలా చేస్తుంది. జిమ్​లో మరింత కష్టపడి కేలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కాఫీలోని కెఫిన్ జీవక్రియ, ఆక్సీకరణను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ రెండు తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది కానీ.. ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుంది. 



వాపు తగ్గుతుందట


రెడ్ వైన్, టీ, కాఫీలతో పోలిస్తే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయ కూడా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. వాపు కంట్రోల్ అవుతుంది. 


రోగనిరోధక శక్తికై.. 


వంద గ్రాముల నిమ్మకాయ రసంలో 53 mg విటమిన్ సి ఉంటుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి హెల్ప్ చేస్తాయని.. యూఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ అగ్రికల్చర్​లో ప్రచురించారు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్​గా పనిచేస్తుంది. 



పోషక శోషణకై


నిమ్మకాయలోని విటమిన్ సి పోషకాలను బాగా గ్రహించడంలో సహాయం చేస్తుంది. దీనిని కాఫీలో తీసుకున్నప్పుడు కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రయోజనకరమైన సమ్మేళనాలను బాగా గ్రహించడంలో హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. 


స్కిన్ హెల్త్​కి.. 


కాఫీ, నిమ్మకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలోని ఫ్రీరాడికల్స్​తో పోరాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిన్​కి మంచి గ్లో ఇస్తుంది. చర్మానికి హైడ్రేషన్​ను అందించి ముడతలు రాకుండా చేస్తుంది.



సైడ్ ఎఫెక్ట్స్.. 


నిమ్మకాయ, కాఫీ రెండూ యాసిడ్ స్వభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఎసిడిటీ సమస్యలు, కడుపులో మంట, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. అందుకే ఇది అందరికీ మంచిది కాదు. సెన్సిటివ్ దంతాలు, చిగుళ్లు ఉంటే కాఫీ, నిమ్మకాయలకు వీలైనంత దూరంగా ఉండాలి. నిద్ర సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా కెఫీన్​కు దూరంగా ఉండాలంటున్నారు. 


బరువు తగ్గడం ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు వీటిని కలిపి తీసుకోవడం కంటే.. విడిగా తీసుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఉండవని.. మరిన్ని మెరుగైన బెనిఫిట్స్ మీ సొంతమవుతాయని చెప్తున్నారు. 


Also Read : కాఫీ అంటే ఇష్టమా? అయితే ఈ ఒక్క మార్పు చేసి కాఫీ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతారు