వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కానీ, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయ శాస్త్రం చెబుతుంది. అందుకే, ఏదైనా కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉంటేగానీ.. నేరాన్ని నిర్ధరించలేరు. ఒక నిందితుడిని దోషిగా ప్రకటించి శిక్ష విధించాలంటే.. ఎన్నో కోణాల్లో ఆలోచించాలి. ఒక వేళ నిందితుడు తన నేరాన్ని అంగీకరిస్తే పర్వాలేదు. తానేమీ చేయలేదంటూ బుకాయిస్తే మాత్రం.. నెలలు.. ఏళ్లు గడిచినా ఆ కేసు వాయిదా పడుతూనే ఉంటుంది. అయితే, త్వరలో రానున్న సరికొత్త కృత్రిమ మేధస్సు.. AI (Artificial intelligence) టెక్నాలజీతో నేరగాళ్లను కనిపెట్టేస్తారట. లాయర్లు లేదా ప్రాసిక్యూటర్స్(న్యాయమూర్తులు)తో పనిలేకుండానే.. దోషులను నిర్ధరించేస్తారట.
AI Prosecutor అనే ఈ టెక్నాలజినీ చైనీస్ అకాడమి ఆఫ్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షీ యాంగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. South China Morning Post కథనం ప్రకారం.. ఒక వ్యక్తి జీవితం మీద ఆధారపడే తీర్పును కంప్యూటర్లు లేదా ఏఐ టెక్నాలజీలు వెల్లడించడం ఏమిటనే అంశంపై ఇప్పుడు పెద్దగానే చర్చ జరుగుతోంది. అయితే, వీటిని పూర్తిగా తీర్పును ఇచ్చేందుకు కాకుండా.. కొన్ని ఆధారాలను పరిశీలించి న్యాయ సలహా ఇచ్చేలా ఉపయోగించడమే మంచిదని మరికొందరు అంటున్నారు. అయితే పరిశోధకులు మాత్రం న్యాయవాదులను దీనితో రీప్లేస్ చేయొచ్చని వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో AI Prosecutor పనితీరును ఇటీవల షాంగై పుడాంగ్ పీపుల్స్ ప్రొక్యురేటరేట్‌లో పరీక్షించారు. అంతేగాక.. షాంగైలో నిత్యం జరిగే ఎనిమిది రకాల నేరాలను గుర్తించేలా దానికి శిక్షణ ఇచ్చారు. 97 శాతం కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో నేరాలను గుర్తించి.. నేరగాళ్లపై ఇది అభియోగాలు నమోదు చేయగలదని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిస్టమ్ 206 టెక్నాలజీ ద్వారా రూపొందిచినట్లు వెల్లడించారు.
AI Prosecutor అనుమానిత క్రిమినల్ కేసు వివరాల ఆధారంగా అభియోగాలను దాఖలు చేస్తుంది. ఒక వేళ అందులో ఏవైనా అసంబద్ధమైన సమాచారం ఉన్నట్లయితే వెంటనే గుర్తించి.. దాన్ని తీసివేస్తుంది లేదా సరిచేస్తుంది. వారు చేసిన నేరాన్ని అంచనా వేసి శిక్షా నిర్ణయాలు లేదా ఛార్జీలను దాఖలు చేస్తుంది. జూదం, క్రెడిట్ కార్డ్ మోసాలు, నిర్లక్ష్య డ్రైవింగ్, దాడులు, దొంగతనం, మోసం, అధికారులను అడ్డుకోవడం, రాజకీయ అసమ్మతి వంటి నేరాలను గుర్తించి.. వాటికి తగిన శిక్షలను ఇది సూచిస్తుంది. ఈ టెక్నాలజీకి ఆయా నేరాలపై ఖచ్చితమైన తీర్పు ఇవ్వగల మేధోసంపత్తి ఉంది. కానీ, తుది తీర్పు ఇచ్చే బాధ్యత మాత్రం న్యాయమూర్తులకే ఉండాలి. లేకపోతే.. న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లు.. ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుంది.