Holi 2024 : ఈ ఏడాది హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 25వ తేదీన 2024లో మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది. ఇండియాలో దీని ప్రభావం ఉంటుందా? ఉండదా? మనం గ్రహణాన్ని చూడగలమా? లేదా? అసలు హోలీని చేసుకోవచ్చా? లేదా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. గ్రహణం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


చంద్ర గ్రహణం సమయాలివే..


ఈ చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపిస్తుంది. దీనిని ఇండియాలో చూడలేము. ఇండియా టైమింగ్స్ ప్రకారం పెనుంబ్రల్ గ్రహణం సోమవారం ఉదయం 10.23 నుంచి ప్రారంభమవుతుంది. 4 గంటల 39 నిమిషాలు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 03.02 గంటలకు ముగుస్తుంది. మార్చి 24వ తేది.. అంటే ఈరోజు సాయంత్రం చివరిలో.. మార్చి 25వ తేదీ తెల్లవారుజామున పౌర్ణమి ఉదయిస్తున్నప్పుడు.. భూమి పెనుంబ్రా గుండా ప్రయాణిస్తుంది. అందుకే దీనిని పెనుంబ్రల్ గ్రహణం అంటున్నామని నాసా తెలిపింది. 


దీనిని నేరుగా చూడవచ్చు..


చంద్రగ్రహణం సమయంలో భూమి.. సూర్యుడు, చంద్రుని మధ్య వెళ్తుంది. ఆ సమయంలో దాని నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు తన సొంత కాంతిని విడుదల చేయడు.. కానీ సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. దీనినే చంద్రగ్రహణం అంటాము. దీనిని ఎలాంటి షేడ్స్ లేకుండా కూడా చూడవచ్చు. సూర్యగ్రహణం చూడడం నేరుగా చూస్తే కంటికి నష్టం కలుగుతుంది. కానీ చంద్రగ్రహణం నేరుగా చూడవచ్చు. అయితే దీనిని చూడాలనుకునేవారు మాత్రం వాతారవరణ పరిస్థితులు తెలుసుకోండి. లేదంటే నిరాశ పడాల్సి వస్తుంది. బైనాక్యూలర్, టెలిస్కోప్​ని ఉపయోగించి.. గ్రహణాన్ని చూడవచ్చు. 


సంపూర్ణ చంద్ర గ్రహణం కాదు..


హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో చాలామంది హోలీని సెలబ్రేట్ చేసుకోవాలా? వద్దా అనే గందరగోళంలో ఉన్నారు. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదని.. పెనుంబ్రల్ చంద్రగ్రహణమని చెప్తున్నారు. పెనుంబ్రల్ చంద్రగ్రహణం కాబట్టి.. దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. పైగా ఈ గ్రహణం భారత్​లో కనిపించదు. దీనివల్ల ఇక్కడ నియమాలు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు పురోహితులు. కాబట్టి హోలీని యథావిధిగా చేసుకోవచ్చు అంటున్నారు. 


చంద్ర గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు


చంద్రగ్రహణం సమయంలో కొందరు కొన్ని నియమాలు పాటిస్తారు. అవేంటంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడల్లా.. దాని సూతక కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. భగవంతుని పూజలు చేయరు. ఆ సమయంలో ఆహారం వండుకోవడం, తినడం చేయరు. గ్రహణ సమయంలో దేవతల విగ్రహాలను తాకరు. ఆలయ ప్రవేశాలు చేయరు. కొందరు కత్తి, సూతి వంటి పదునైన వస్తువులకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా గర్భిణులు బయటకు వెళ్లరు. గ్రహణం ముగిసిన వెంటనే తెల్లని వస్తువులు దానం చేస్తారు. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు కాబట్టి.. పైగా దీని ప్రభావం ఇండియాపై అస్సలు ఉండదు కాబట్టి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా హోలీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. 


Also Read : ఈ ఫేస్​ మాస్క్​లు సింపుల్​గా హోలీ కలర్స్ పోగొడతాయి.. స్కిన్​ డ్యామేజ్​ని కూడా తగ్గిస్తాయి