Malkajgiri BJP Candidate Etela Rajender- మల్కాజిగిరి: కొట్లాడే గొంతుక అంటే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే మల్కాజిగిరి నియోజకవర్గానికి నువ్వేం చేశావో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కి మల్కాజిగిరికి ఏం సంబంధం అని అడుగుతున్నాడని, తాను ఇక్కడ నివాసిని అని మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి చెప్పారు. విజయసంకల్ప సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి నీ సిట్టింగ్ స్థానమే అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి కూడా ఎందుకు గెలవలేదో ప్రజలకు చెప్పాలన్నారు. నడమంత్రపు సిరి మంచిది కాదని, తనను ఇక్కడి వాడని కాదని ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 


తాను పూడూరులో స్థిరపడ్డ వాడ్ని అని, తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రులు ఎంత ఇబ్బంది పెట్టినా కొట్లాట ఆపలేదన్నారు. ‘కేసీఆర్ నన్ను బయటికి పంపిననాడు నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ. కేసీఆర్ నన్ను ఓడించాలని చూస్తే 6 నెలలపాటు ఇబ్బంది పడితే, వాళ్ల చెంప చెళ్లుమనిపించిన గడ్డ హుజూరాబాద్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరివరకూ బీజేపీలో కొనసాగుతా. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయడమే మనందరి ఎజెండా. కేసీఆర్ ని ఎదిరించి గట్టిగా కోడ్లాడిన పార్టీ బీజేపీ. గత ప్రభుత్వంలో ఏ ఉప ఎన్నిక జరిగినా గెలిచింది బీజేపీ. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి ప్రజలు వారికి ఓట్లు వేశారు. కానీ ఎంపీ ఎన్నికల్లో జెండా, ఎజెండాతో సంబంధం లేకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మల్కాజిగిరిలో మొన్న జనప్రభంజనం చూసి మోదీ ముగ్ధులయ్యారు’ అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.


కొట్లాడే సత్తా బీజేపీకే ఉంది..  
17 ఎంపీ స్థానాల్లో కొట్లాడే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. 12 స్థానాలు బీజేపీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. పైకి కనిపించకుండా అన్ని వర్గాల వారు చాపకింద నీరులా పనిచేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలకు నరేంద్ర మోదీ స్వస్తిపలికారు. రామునికి గుడి కట్టి భారతీయ సంస్కృతిని కాపాడారు. 47 లక్షల బడ్జెట్ తో గొప్ప దేశంగా తీర్చిదిద్దారు. ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానానికి తీసుకువచ్చి మేడ్ ఇన్ ఇండియా నిజం చేశారు మోదీ. ఇప్పుడు రక్షణ రంగానికి పరికరాలు అన్నీ మనదగ్గరే తయారు చేస్తున్నారు. కరోనా సమయంలో బ్రిటన్, ఇరాన్ ప్రధాన మంత్రులు కన్నీరు పెడితే, దేశ ప్రజల్లో ధైర్యం నింపి వాక్సిన్ ఇచ్చి కాపాడిన నేత మోదీ. అమెరికాకు కూడా టాబ్లెట్స్ పంపిన ఘనత మోదీదే.  - ఈటల రాజేందర్


కేసీఆర్ పార్టీలో అందరూ జారిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలందరూ బీజేపీ వైపు ముగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది మురికికాలువలో వేసినట్టు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉండి ఉంటే, కేంద్రంతో పోరాడే సత్తా తమకు ఉందని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అడిగేవారు. కానీ కేసీఆర్ ఈరోజు అలా అడిగే సీన్ లేదన్నారు. రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. మోదీ హయాంలో ఒక్క స్కాం లేదు. ఆయన హామీ ఇచ్చారు అంటే అమలు అయినట్టే అన్నారు. ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 15 సీట్లు గెలిపించాలని సీఎం రేవంత్ అడుగుతున్నారు, మీరు ఎంతమంది ఉన్నా ఏం చేయలేరన్నారు. కానీ బీజేపీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 


కేంద్రం నిధులతో హైదరాబాద్ ఫ్లై ఓవర్లు
హైదరాబాద్ లో కడుతున్న ఫ్లై ఓవర్లు కేంద్ర నిదులతో కడుతున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. తనను గెలిపిస్తే ఇక్కడ ఇచ్చిన హామీల కోసం కొట్లాడి.. ఢిల్లీలో ప్రధాని మోదీ దగ్గర నిధులు తీసుకువస్తా అని హామీ ఇచ్చారు. సుస్థిర, సుభిక్ష, సుసంపన్న, ప్రశాంత  భారత దేశం కోసం నరేంద్ర మోదీని ప్రధానిని చేయడానికి తనను మల్కాజ్గిరి నుండి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఈటల రాజేందర్ మిత్రులు నందారెడ్డి, పూడూరు నరసింహరెడ్డి, మురళీధర్ గుప్తా, వీరితో పాటు అనేక సంఘాల నాయకులు, హమాలీ సంఘంవారు, సౌమిత్ రెడ్డి నాయకత్వంలో వందమంది యువకులు బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, కార్పొరేటర్ హంసారాణి తదితరులు పాల్గొన్నారు.