కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు. మరికొంతమంది మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అని కూడా అంటారు.  ఇవి తెలుగు సాంప్రదాయపు వంటల్లో భాగం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వంటకం మన ఆహారం భాగమై ఉంది. వడియాలు, అప్పడాలు కోవకే ఇది కూడా చెందుతుంది. సాంబారు, పప్పన్నం, పెరుగన్నానికి జతగా వీటిని తింటారు. కాస్త కారంగా భలే రుచిగా ఉంటాయి. ఒక్కసారి వీటి రుచి నచ్చిందో మరి వదలలేరు. అమ్మమ్మలు, నాన్నమ్మల కాలంలో  వీటిని బాగా చేసేవాళ్లు. ఇప్పుడు మార్కెట్లో ఇవి దొరకుతున్నా, ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఉప్పును అధికంగా వేస్తున్నారు. దీని వల్ల రుచి ఉండదు సరికదా, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వారు తినలేరు. 


కావాల్సిన పదార్థాలు
పచ్చి మిర్చి - కిలో
పుల్లని పెరుగు - అర లీటరు
ఉప్పు - రుచికి సరిపడా 


తయారీ ఇలా
1. పచ్చి మిరపకాయలు పొడవుగా, కాస్త ముదురు రంగులో ఉన్నవి ఎంచుకోవాలి. లావుగా ఉండేలా చూసుకోవాలి. 
2. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మధ్యలో నిలువుగా కోసుకోవాలి. 
3. పెరుగును తీసుకుని బాగా గిలక్కొట్టి మజ్జిగ చేసుకోవాలి. అందులో రెండు స్పూనుల ఉప్పు వేయాలి. 
4. మరీ అధికంగా నీళ్లు పోయకూడదు. మజ్జిక కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి. పుల్లని పెరుగైతే చాలా మంచిది. 
5. ఆ మజ్జిగలో మిరపకాయలను వేసి మూత పెట్టాలి. 
6. మూడు రోజుల పాటూ అలా ఉంచితే బాగా ఊరుతాయి. 
7. మూడు రోజుల తరువాత తీసి ఎర్రటి ఎండలో ఒక్కో మిరపకాయను విడదీసి వస్త్రంపై ఎండబెట్టాలి. 
8. ఉదయమంతా ఎండిన మిరపకాయలను రాత్రి మళ్లీ  అదే మజ్జిగలో వేయాలి. 
9. అలా మూడు రోజుల పాటూ చేయాలి. 
10. అలా చేయడం వల్ల మజ్జిగంతా బాగా మిరపకాయల్లోకి బాగా ఊరుతుంది. 
11. తరువాత మాత్రం మిరపకాయలను ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి. గిన్నెల వేస్తే గలగలలాడేంతగా బాగా ఎండాక ఓ సీసాలో వేసుకుని దాచుకోవాలి. 
12. నూనెలో  వేయించుకుని సాంబారన్న లేదా పప్పన్నంతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పెరుగన్నం, మజ్జిగన్నంతో తిన్నా బావుంటాయి. 


Also read: రోజుకు ఎన్ని నీళ్లు తాగితే హైబీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు?



Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి


Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది