ఆ మొక్క దగ్గరికి వెళ్లకూడదనుకున్నా కూడా తూనీగలు, కీటకాలు మైకం కమ్మినట్టు వెళ్లిపోతాయి. దగ్గరికి వెళ్లాక ఆ మొక్క తన పూలతో వాటిని కప్పి జీర్ణం చేసేసుకుంటుంది. క్రిమి కీటకాలను తిని బతికే మాంసాహార మొక్కలు ఇవి. మనదేశంలోనూ వీటికి ఉనికి ఉంది. ముఖ్యంగా మేఘాలయ రాష్ట్రంలో వీటిని గతంలో కనుగొన్నారు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మేఘాలయలో ఉండేది మాత్రం ‘పిచర్ ప్లాంట్స్’ జాతివి. ఇవి కూజాలా ఉంటాయి. లోపలికి కీటకాలు చేరగానే జీర్ణరసాలు వాటిని కరిగించేస్తాయి. ఇప్పుడు మరోరకం మాంసాహార మొక్కలను ఇండియాలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. 


ఎక్కడ?
ఉత్తరాఖండ్ లోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని చమోలీ జిల్లాలోని మండల్ లోయలో ఈ అరుదైన జాతులను కనుగొన్నారు. ఈ మొక్కల పేరు ‘ఉట్రిక్యులారియా ఫర్సెల్లాటా’. ఉత్తరాఖండ్ అటవీశాఖ, మొక్కల శాస్త్రవేత్తలు కలిపి వీటిని కనుగొన్నారు. ఇది తడి నేలల్లోనే జీవిస్తుంది. తమ చుట్టూ తిరగే కీటకాలను ట్రాప్ చేయడంలో ఈ మొక్కలు దిట్ట. ఈ మాంసాహార మొక్క సాధారణంగా బ్లాడర్ వార్ట్స్ అనే జాతికి చెందినది. 


ట్రాప్ చేసి...
ఈ మొక్క  కీటకాల కోసం వాకయూమ్ లేదా నెగిటివ్ ప్రెజర్ ఏరియాను తన చుట్టూ సృష్టిస్తుంది. ఆ ప్రెజర్ కు కీటకాలు దానివైపుగా వచ్చి దగ్గరగా వస్తాయి. వెంటనే ఇది వాటిని పట్టేస్తుంది. దోమలు, ప్రోటోజోవాలు, చిన్న చిన్న కీటకాలు వంటివాటిని ఇవి తింటాయి. ఇవి సాధారణంగా పెద్దగా పోషకాలు లేని భూమిలో పెరుగుతుంటాయి. వాటికి కావాల్సిన పోషకాల కోసం ఇలా కీటకాలపై ఆధారపడతాయి. ముఖ్యంగా ప్రోటీన్ కోసం కీటకాలను తింటాయని చెబుతారు శాస్త్రవేత్తలు. అయితే ఈ మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు పరిశోధకులు. 


ఆన్ లైన్లో అమ్మకానికి....
ఈ కీటకాహార మొక్కలను ఆన్ లైన్లో అమ్మకానికి కూడా పెడుతున్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఇవి దోమలను తింటాయి కాబట్టి వీటిని కొనుక్కునే వాళ్లు ఎక్కువవుతున్నారు. 



 



Also read: ఇలా ఒంటికాలిపై పది సెకన్ల పాటూ నిల్చోగలరా? ఈ టెస్టు మీ ఆయువు గురించి చెప్పేస్తుంది


Also read: బొప్పాయి, నిమ్మరసం కలిపి తినకూడదా? విషంగా మారుతుందా?