చాలా మందికి కార్డియాక్ అరెస్టుకు, గుండె పోటుకు మధ్య తేడా తెలియదు. రెండూ గుండె నొప్పులుగానే భావిస్తారు. నిజానికి రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. 


కార్డియాక్ అరెస్టు అంటే...
గుండె నిరంతరం శరీర అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి హఠాత్తుగా గుండె లయ అసాధారణంగా మారి, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్ని కార్డియాక్ అరెస్టు అంటారు. ఈ పరిస్థితుల్లో గుండె నుంచి మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు సరఫరా ఆగిపోతుంది. ఆ సమయంలో పూర్తిగా  స్పృహ కోల్పోవడం, శ్వాస ప్రక్రియ ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటివారికి నిమిషాల్లో అత్యవసర చికిత్స అందివ్వాలి. 


గుండె పోటు అంటే...
గుండెకు రక్త నాళాల్లో అడ్డురావడం, రక్త సరఫరాలో ఆటంకం కలగడం వంటివి సంభవించినప్పుడు గుండెలో సన్నగా నొప్పి మొదలై గుండె పోటుకు దారితీస్తుంది. రక్తనాళాల్లో ఏర్పడిన ఆటంకం కొన్నినిమిషాల్లో తెరుచుకుంటే పర్వాలేదు, లేకుంటే పరిస్థితి చేయిదాటొచ్చు. 


ఎందుకు వస్తుంది?
 గుండెలోని కింద గదులను జఠరికలు అంటారు. ఆ గదులలో ఆకస్మికంగా విద్యుత్ అస్థిరత కలగడం వల్ల గుండె కొట్టుకునే వేగం మారి ‘వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్’ ఏర్పడుతుంది. ఈ సమయంలో హృదయ స్పందన నిమిషానికి 300 బీట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఉంటుంది, ఎటువంటి చర్య తీసుకోకపోతే, గుండె పూర్తిగా కొట్టుకోవడం ఆగిపోతుంది.


చల్లని వాతావరణానికి, కార్డియాక్ అరెస్టుకు సంబంధం ఏంటి?
అమెరికాలో చేసిన అధ్యయనాల ప్రకారం డిసెంబరు, జనవరి నెలల్లో కార్డియాక్ అరెస్టు కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రతి లక్ష మందిలో 167 నుంచి 175 మందిలో కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయి. జూన్ లో మాత్రం చాలా తక్కువగా 131 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే చల్లని వాతావరణానికి, కార్డియాక్ అరెస్టుకు మధ్య సంబంధం ఉందని తేల్చారు అధ్యయన కర్తలు. కేవలం అమెరికాలోనే కాదు, కొరియా, చైనా, ఫిన్లాండ్, బ్రిటన్ దేశాల్లో కూడా ఇవే అధ్యయన ఫలితాలు కనిపించాయి. 


చల్లని వాతావరణంలో శరీరంలో గడ్డలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ముందుగా ఎర్రరక్త కణాల సంఖ్య పెరగడం, ప్లాస్మా కొలెస్ట్రాల్ పెరగడం, గడ్డకట్టాన్ని ప్రోత్సహించే ఫైబ్రినోజెన్ అనే గ్లైకోప్రోటీన్ పెరగడం... వంటి కారణాల వల్ల కార్డియాక్ అరెస్టు సంభవించచ్చు. అందుకే చలికాలంలోనూ, చల్లని వాతావరణంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also Read: పాలకూర సూప్... వారానికోసారి తాగండి చాలు


Also Read: గోనెసంచి నిండా కాయిన్స్ ఇచ్చి స్కూటర్ కొన్నాడు, వీడియో చూడండి