కన్నడ సినీ నటుడు, దర్శకుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన వయస్సు 44 ఏళ్ళు. ఆమె రాత్రి నిద్రపోయాక ఉదయం మరి లేవలేదు. నిద్రలోనే ఆకస్మిక కార్డియాక్ అరెస్టు వల్ల ఆమె మరణించిందని భావిస్తున్నారు వైద్యులు. ఇలా చాలామందికి జరుగుతుంది. నిద్రలోనే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో వివరిస్తున్నారు వైద్యులు.


కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా కొన్ని రకాల గుండె వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇవి జన్యుపరమైనవి. ఇలాంటి వారిలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ నిద్రలో వచ్చే అవకాశం ఉంది. అలాగే పుట్టుకతో వచ్చే గుండె లోపాలు లేదా గుండె నిర్మాణంలో అసాధారణతలు కూడా నిద్రలో ఉన్నప్పుడు గుండెకు చెందిన విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల కూడా కార్డియాక్ అరెస్టు వచ్చే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సక్రమంగా లేనప్పుడు అంటే గుండెలయ అదుపు తప్పినప్పుడు ఇలాంటి ఆకస్మిక కార్డియాక్ అరెస్టుకు దారి తీయవచ్చు.  కార్డియాక్ అరెస్టు అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వస్తుంది.ఇది సాధారణంగా గుండె కండరానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. దీనికి వెంటనే చికిత్స అవసరం. సీపీఆర్ వంటివి చేస్తే ప్రాణం నిలిచే అవకాశం ఉంది. కానీ నిద్రలో కార్డియాక్ అరెస్టు వస్తే మాత్రం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రాణం నిలిచే అవకాశం లేదు. 


కొన్ని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా ఇలా నిద్రలోనే గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. ఊబకాయం, మధుమేహం వంటివి గుండెకు చేటు చేస్తాయి. ఇవన్నీ కూడా గుండె సమస్యను పెంచుతాయి. అందుకే ప్రతి ఏడాది గుండెను చెక్ చేయించుకోవడం చాలా అవసరం. గుండె పనితీరు ఎలా ఉందో, గుండె ఆకారం ఎలా ఉందో వైద్యుల చేత ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి.


ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా కూడా గుండెను కాపాడుకోవచ్చు. సమతుల్య ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలి. శారీరకంగా చురుగ్గా ఉండాలి. రోజూ వాకింగ్ చేయాలి. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరం. అలాగే ఛాతీ నొప్పి రావడం, గుండెల్లో దడ, తల తిరగడం, మూర్ఛ వంటివి గుండె ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలుగా భావించాలి. ఇలాంటివి కనిపిస్తే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రత్యేకించి కుటుంబ చరిత్రలో గుండె సంబంధించిన అనారోగ్యాలతో  ఉన్న వారి వారసులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో జన్యు పరీక్షలు వారసత్వంగా వచ్చిన గుండె జబ్బులను నిర్ణయించడానికి సహాయపడతాయి. కాబట్టి అలాంటి జన్యు పరీక్షలను కూడా నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే గుండెకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.


Also read: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దీన్ని తినకపోతేనే ఆరోగ్యం


Also read: బ్లాక్ ప్లాస్టిక్ బాక్స్‌లో రెస్టారెంట్లలో ఆహారాన్ని అందిస్తున్నారా? ఆ నల్ల ప్లాస్టిక్ ఎంతో హానికరం



























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.