తెల్ల ప్లాస్టిక్ కవర్లు, నల్ల ప్లాస్టిక్ కవర్లు దొరుకుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ వాళ్ళు ఆహారాన్ని పార్సెల్ చేసే ప్లాస్టిక్ బాక్సులు కూడా నలుపు రంగు పులుముకున్నాయి. ఇలా బ్లాక్ ప్లాస్టిక్ లో ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బ్లాక్ ప్లాస్టిక్ పర్యావరణానికి చాలా హానికరమైనది. పర్యావరణం హానికరంగా మారితే మన ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడినట్టే. బ్లాక్ ప్లాస్టిక్‌ను నిరోధించాల్సిన అవసరం ఉంది.
బ్లాక్ ప్లాస్టిక్ అధికంగా ఫుడ్ ప్యాకేజింగ్, డిస్పోజబుల్ కట్లరీలలో కనిపిస్తుంది. ఈ బ్లాక్ ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. దీని తయారీలో ప్లాస్టిక్ రెసిన్‌కు... కార్బన్ బ్లాక్ పిగ్మెంట్లను జోడిస్తారు. ఈ వర్ణ ద్రవ్యం ప్లాస్టిక్‌ను నలుపుగా మారుస్తుంది. రీసైక్లింగ్ ప్లాంట్లలో ఈ బ్లాక్ ప్లాస్టిక్ బాక్సులను వేసినప్పుడు... బ్లాక్ ప్లాస్టిక్, అందులోని ఇతర పదార్థాల మధ్య తేడాను ఆ ప్లాంట్లలోని సిస్టమ్ గుర్తించలేదు. దీనివల్ల ఈ నల్లటి ప్లాస్టిక్ అధికంగా దహన యంత్రాలలోకి వెళ్లిపోతుంది. ఆ ప్లాస్టిక్‌ను అక్కడ దహనం చేయడం వల్ల విపరీతమైన పొగ వస్తుంది. ఇది పర్యావరణంలో కలిసి కాలుష్యానికి దోహదం చేస్తుంది. అది మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం. ఆ గాలిలో చేరిన ప్లాస్టిక్ కణాలు గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుకొని, చాలా సమస్యలను సృష్టిస్తాయి.
బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో తయారీలో థాలేట్స్, బీపీఏ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వీటిని అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినప్పుడు అవి ఆహారంలో కలిసే అవకాశం ఉంది. ఆహారంతో కలిపి వాటిని తింటే అవి మన శరీరంలో చేరి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు స్వాగతం పలుకుతాయి. కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్లను ఓవెన్‌లో వేడి చేయడం వంటివి చేయకూడదు. ఎక్కువగా వేడిచేస్తే చాలా ప్రమాదం. కంటికి కనిపించకుండా సూక్ష్మంగా ప్లాస్టిక్ కణాలు ఆహారంలో చేరి చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం అవుతాయి.
ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు సింగిల్ యూజ్ డబ్బాలుగా వాడతారు. ముఖ్యంగా ప్రయాణంలో వీటిని అధికంగా వినియోగిస్తారు. వీటి వినియోగంతో ముడిపడి ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన లేదు. వీలైనంతవరకు బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న ఆహారాన్ని తినక పోవడమే మంచిది. ఇది పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని రక్షించుకున్నవారవుతారు. నిజానికి ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏవీ ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచివి కావు.
Also read: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దీన్ని తినకపోతేనే ఆరోగ్యం
Also read: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.