సమోసా, మామోస్, నాన్, తందూరి, రోటీ, పిజ్జా, నూడిల్స్ ఇవన్నీ కూడా ఇప్పటి తరానికి ఎంతో ఇష్టమైన వంటకాలు. వీటిని మైదాతోనే తయారు చేస్తారు. మైదా అంటే బాగా శుద్ధి చేసిన తెల్లటి పిండి. ఈ పిండితో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే ఎక్కువమంది ఆ వంటకాలకు దాసోహం అయిపోతారు. అయితే తెల్లటి పిండిని ఆరోగ్య నిపుణులు మాత్రం వైట్ పాయిజన్ అని పిలుస్తారు. తెల్లగా ఉండే విషంగా చెప్పుకునే మైదా దీన్ని తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి.


మైదా చరిత్ర 32 వేల క్రితం నాటిది. ఇటాలియన్లు తొలిసారిగా ఈ పిండిని తయారు చేశారని అంటారు. గోధుమ గింజలను బాగా దంచి ఈ పిండిని తయారు చేశారని చెబుతారు. ఐదువేల వేల క్రితం పురాతన ఈజిప్టులో కూడా ఈ పిండిని తయారు చేసే ప్రయత్నాలు జరిగాయని అంటారు. గోధుమలను బాగా రుబ్బి వాటిని ఫిల్టర్ చేసి తర్వాత మెత్తటి మైదాని తయారు చేశారని చెబుతారు. మైదా తయారీకి చాలా సమయం పడుతుంది. దీన్ని అప్పట్లో కేవలం రాజు గారి వంటగదిలో మాత్రమే ఉపయోగించేవారు. అందుకే ఒకప్పుడు మైదా ధనవంతుల ఆహారంగా ఉండేది. రాతి మిల్లుల నుండి తయారైన ఈ చిక్కటి పిండితో ఎన్నో రకాల వంటకాలు చేసుకునేవారు. అప్పట్లో దీని పౌష్టిక విలువలు వారికి తెలియదు.


మైదాను చాలా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. అందుకే ఇది గోధుమలతో తయారైనప్పటికీ చాలా తెల్లటి రంగులో ఉంటుంది. అలాగే ఎంతో మెత్తగా ఉంటుంది. మైదాకు ఇలాంటి తెల్లటి రంగును, మెత్తటి రూపాన్ని ఇవ్వడం కోసం దానిలో బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. అలాగే అలోక్సాన్ అనే మరో రసాయనం కూడా కలిపి మైదా మరింత మెత్తగా వచ్చేలా చేస్తారు. ఈ రెండు రసాయనాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని హెయిర్ డైలలో వాడుతూ ఉంటారు. వీటిని మనం తినడం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మైదాను తెల్లటి విషమని పిలుస్తారు.


పౌష్టికాహార కోణం నుంచి చూసినా కూడా మైదా తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. కాబట్టి ఫైబర్, విటమిన్‌లు, ఖనిజాలు ఏవీ దీనిలో ఉండవు. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైదాతో చేసిన ఆహారాలు తినగానే చక్కెర స్థాయిలను ఇట్టే పెంచుతుంది. మైదాలో గోధుమ పిండిలో ఉన్న పోషక విలువలు ఉండవు. కాబట్టి సమతుల్య ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోలేము.


మైదాతో చేసిన పూరీలు, వంటకాలు తినడం వల్ల శరీరంలో పోషక లోపాలు రావచ్చు. రోగనిరోధక శక్తిపై ఇది ప్రత్యక్షంగానే ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరానికి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికంగా మైదాపిండితో చేసిన వంటకాలను వండుతారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం ఈ మైదాని తినడం వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. ఆలోచించే సామర్థ్యం, అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతాయి. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి మైదాను పూర్తిగా మానేయడమే మంచిది. వీటితో అధికంగా ఆహారం తినే వ్యక్తులకు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. 


Also read: సిఫిలిస్, ఇదొక లైంగిక వ్యాధి- దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే

























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.