సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు అనగానే అందరికీ ఎయిడ్స్ మాత్రమే గుర్తు వస్తుంది, కానీ మరెన్నో లైంగిక వ్యాధులు ఉన్నాయి. వాటిల్లో సిఫిలిస్ ఒకటి. ఇది చాలా పురాతనమైనదనే చెబుతారు. 1490లోనే సిఫిలిస్ కేసులు నమోదయ్యాయని అంటారు. దీన్ని ఫ్రెంచ్ వ్యాధి, పాలిష్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి సోకితే తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనివల్ల చికిత్స తీసుకోవడం చాలా ఆలస్యం అయిపోతుంది. లైంగిక వ్యాధులు ఉన్న వారితో లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల సిఫిలిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది లైంగిక చర్య ద్వారానే ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. కాబట్టి దీన్ని అంటువ్యాధిగానే చెప్పుకోవాలి. అయితే సిఫిలిస్ ఉన్న వ్యక్తులతో కలిసి భోజనం చేయడం వల్ల, వారు వేసుకున్న దుస్తులు వేసుకోవడం వలన, కలిసి రూమ్ షేర్ చేసుకోవడం వలన ఈ సిఫిలిస్ వ్యాధి అంటుకోదు. వారితో లైంగిక చర్యల్లో పాల్గొంటేనే ఈ వ్యాధి వస్తుంది.


ట్రెపోనెమా పాలిడమ్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ సిఫిలిస్ వ్యాధి వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్న సూదులు,  ఇంజక్షన్లు వల్ల కూడా ఇది సోకే అవకాశం ఉంది. గర్భం ధరించాక తల్లికి ఈ సిఫిలిస్ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డకు కూడా ఇది వ్యాపిస్తుంది. ఎక్కువ కాలం పాటు దీనికి చికిత్స చేయించకుండా వదిలేస్తే గుండె, మెదడు వంటి ప్రధాన అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి సిఫిలిస్ సోకితే కనిపించే లక్షణాల గురించి అవగాహన పెంచుకోవాలి.


సిఫిలిస్ సోకితే జననేంద్రియాల వద్ద నొప్పి, పుండ్లు వంటివి వస్తాయి.  మూడు నుండి ఆరువారాలలో వాటంతట అవే నయం అయిపోతాయి. ఇలా నయం అయిపోగానే ఎక్కువమంది పట్టించుకోరు. కానీ తర్వాత తీవ్రమైన లక్షణాలు మొదలవుతాయి. గొంతు మంట పుడుతుంది. అరచేతిలో, అరికాళ్ళపై దద్దుర్లు వస్తాయి. లింఫ్ నోడ్స్ వాపు వస్తుంది. తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఒళ్ళు నొప్పులు పెడతాయి. జుట్టు ఊడిపోతుంది. విపరీతమైన అలసట వస్తుంది. జ్వరం వచ్చి పోతూ ఉంటుంది. ఈ సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకుంటే భారీగా నష్టపోవాల్సి రావచ్చు. సిఫిలిస్ బ్యాక్టీరియా శరీరంలో చాలా చురుకుగా ఉంటుంది. గుండె, మెదడు, నరాలు, ఎముకలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇంకా చికిత్స తీసుకోపోతే కండరాలు కదల్చలేని పరిస్థితి వస్తుంది. మానసికంగా గందరగోళంగా ఉంటారు. కంటి చూపు సమస్యలు వస్తాయి. పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి లైంగిక చర్యల్లో పాల్గొన్నప్పుడు ఒకే భాగస్వామితో ఉండడం మంచిది. చెడు దారి పడితే ఇలాంటి సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.


Also read: అమ్మో టమోటాలు, ఒకప్పుడు వీటిని తినాలంటే వణికిపోయేవారు


Also read: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్

















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.