ఏ కూర వండినా, అందులో టమాటా ముక్కలు పడాల్సిందే. ఇక బిర్యానీలు, పులావులు అయితే టమోటా కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు కిలో 200 రూపాయలు దాకా చేరుకోవడంతో ఎంతోమంది టమోటాలు కొనలేని పరిస్థితి వచ్చింది. టమోటో కూర అంటే ధనవంతుల కూరగా మారిపోయింది. ఇప్పుడంటే టమోటాల కోసం విలవిలలాడిపోతున్నారు. కానీ ఒకప్పుడు వీటిని తినాలంటేనే మునిగి పోయేవారు.
టమోటాలు ఎక్కడ పుట్టాయో చెప్పడం చాలా కష్టం, కానీ చరిత్రకారులు చెబుతున్న ప్రకారం దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో వాటిని మొదటిసారి పండించారని అంటారు. చిలీ, బొలీవియా వంటి దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో టమోటాలు మొదటగా పండాయని అంటారు. క్రీస్తుశకం 700లోనే టమోటోలు పండినట్టు ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఆ టమోటోలు మొదట్లో చాలా చేదుగా ఉండేవని, వాటిని తినేందుకు ఎంతోమంది భయపడేవారు అని అంటారు. కాలం గడుస్తున్న కొద్దీ వీటి రుచి కూడా మారుతూ వచ్చిందని చెబుతారు. టమోటాల రుచి మారాక, ప్రపంచ నావికుడైన క్రిస్టోఫర్ కొలంబస్ ఈ టమోటోలను యూరోపియన్లకు పరిచయం చేశాడని అంటారు. అప్పటినుంచి యూరోప్‌లో కూడా టమోటాలను పండించడం మొదలుపెట్టారని చెబుతారు. ఒకప్పుడు టమోటాలను విషపూరితమైనవిగా చూసేవారు. వాటిని తినేవారు కాదు. మొక్కలను పీకి పడేసేవారు. అమెరికాలో కూడా ఇలాంటి సందేహాలే ఉండేవి. ఈ సందేహాలు అన్ని 19వ శతాబ్దంలో బద్దలైపోయాయి. టమోటో లేని వంట ఇప్పుడు లేదు. ఒకప్పుడు పాయిజన్ ఆపిల్‌గా పిలిచిన టమోటో ఇప్పుడు అత్యవసరమైన కూరగా మారిపోయింది.
అయితే మన దేశానికి మాత్రం టమోటోలను పరిచయం చేసింది పోర్చుగీసు వారని అంటారు. టమోటాలతో పాటు మొక్కజొన్న, జీడిపప్పు, క్యాప్సికం, అవకాడో వంటి పంటలను పోర్చుగీసు వారే తమతో పాటు భారత్‌కి తెచ్చారని చెబుతున్నారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు టమోటా పండడానికి సరిగ్గా సరిపోతాయి. భారత నేలల్లో టమోటాలు విరగ కాస్తాయి. దానివల్ల ఇప్పుడు టమోటోలు ప్రధాన పంటగా మారిపోయాయి. దీని పుల్లని రుచి అందరికీ నచ్చింది. ఇప్పుడు టమోటో లేని ఆహారం ఊహించుకోవడమే కష్టంగా మారిపోయింది. దీంతో చేసే టమోటో సాస్ ప్రపంచ ప్రఖ్యాత వంటకంగా పేరు తెచ్చుకుంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు టమోటా సాస్ ఉండడం కచ్చితంగా అయిపోయింది. టమోటా తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడంతో అందరూ టమోటోకు అభిమానులు అయిపోయారు. ఇప్పుడు టమోటాలు మోస్ట్ వాంటెడ్ ఆహారంగా మారిపోయింది.
Also read: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్
Also read: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.