వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం, వారికి అందుతున్న సహాయం గురించి ఆరా తీసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం హెలీకాప్టర్‌లో అల్లూరి జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. వీలీన మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కూనవరంలో జరిగిన సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. 


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన..
కూనవరం నుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్న ముఖ్యమంత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో రాత్రికి బస చేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వరద ప్రభావానికి గురైన పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం పరిశీలించనున్నారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాజమండ్రి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం గురజాపు లంక గ్రామానికి చేరుకుంటారు. 9.40 నిముషాల నుంచి 10.25 నిమిషాల వరకు కునలంకలోని వరద ప్రభావిత ప్రాంత బాధితులతో మాట్లాడతారు. 10.25 నిమిషాలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి ముమ్మిడివరం మండలం రామాలయంపేట గ్రామం లంక ఆఫ్‌ ఠానేలంక రోడ్డు మార్గాన 10.35 నిమిషాలకు చేరుకుంటారు. 11.10 నిమిషాల వరకు లంక ఆఫ్‌ ఠానేలంకలోని వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం కొండుకుదురు 11.50 నిమిషాల వరకు వరద బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడతారు. అక్కడి నుంచి బయలు దేరి గురజాపు లంక గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 12.15 నిమిషాలకు గురజాపులంక గ్రామం నుంచి హెలీకాప్టర్‌లో తాడేపల్లి బయలుదేరుతారు. 


ముఖ్యమంత్రి జగన్‌ రాకతో రాజమండ్రి సిటీ అంతా వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎంపీ మార్గాని భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువజన నాయకులు జక్కంపూడి భరత్‌, రుడా ఛైర్మన్‌ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు, కటౌట్‌లతో నిండిపోయింది.. 


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్ పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయని సీఎం జగన్ అన్నారు. తమ ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి ప్రతీ వివరాలు కలెక్టర్ వద్ద ఉన్నాయని తెలిపారు. మొట్టమొదటి సారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గతానికంటే భిన్నంగా చూశారన్నారు.


తమందరి ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతున్నట్లు చేయడమో చేయలేదని చెప్పారు జగన్. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజులుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పామని వివరించారు. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వలంటీర్ల నుంచి యాక్టివేట్‌ చేశామన్నారు. వరద వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందించే కార్యక్రమాన్ని చూస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు


రాజమండ్రిలోనే చంద్రబాబు..
పశ్చిమగోదావరి జిల్లాలోని సుడిగాలి పర్యటన చేసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి రాజమండ్రిలోని మోరంపూడి వద్ద కన్వెన్షన్‌ హాలులో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాజమండ్రిలో అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో చంద్రబాబు ఫ్లెక్సీలు వెలిశాయి. పలుచోట్ల పసుపు జెండాలు రెపరెలాడాయి.