పెళ్లిళ్లకు బంగారం కొనడం, ధరించడం చాలా పవిత్రంగా భావిస్తారు చైనాలో. మనదేశంలో బంగారానికి ఎంత విలువుందో చైనాలో కూడా అంతే విలువుంది. అందుకే బహుమతి అనగానే బంగారాన్నే కొనేవాళ్లు ఎక్కువమంది. ఈ మధ్యన జరిగిన ఓ పెళ్లిలో వరుడు తనకు కాబోయే భార్యకు బోలెడన్నీ నెక్లెస్లను, గాజులను కానుకగా అందించాడు. పెళ్లి ఆనందం పక్కన పెడితే, వాటిని మోయడానికి ఆ కొత్త పెళ్లికూతురు అష్టకష్టాలు పడింది. ఇప్పుడిది చైనాలో ట్రెండింగ్ మారింది. 


చైనాలోని హుబయ్ ప్రావిన్స్ లో గత నెలలో ఈ పెళ్లి జరిగిందని సమాచారం. వధువు తెల్లని వివాహ గౌనులో చేతిలో ఎర్రగులాబీల బొకేతో అందంగా ముస్తాబైంది. కాబోయే భర్త ఆమెకు పెద్ద పెద్ద నెక్లెస్ లను బహుమతిగా అందించాడు. వాటన్నింటినీ ఆమె ధరించింది. అలాగే భర్త తరుపు బంధువులు చేతికి గాజులను బహుమతిగా అందించారు. వీటన్నింటి బరువు 60 కిలోగ్రాములు. ఇక నెక్లెస్ లు ఒక్కొక్కటి కిలోకి తక్కువ కాకుండా బరువు తూగాయిట. వరుడు చాలా ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తని తెలిసింది. అందుకే ఇలా బంగారంలో ముంచెత్తాడట. 


పాపం వధువు మాత్రం కళ్యాణ వేదికకు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. పెళ్లి కొడుకు సాయంతో చాలా మెల్లగా నడవగలిగింది. అరవై కిలోలు బరువును గంటల పాటూ మోయడమంటే మాటలా. ఆ పెళ్లి కూతురు బరువు కూడా అరవైకిలోల కన్నా తక్కువే. ఆమె పరిస్థితి చూసి అక్కడున్న బంధువులు కూడా జాలిపడ్డారు. ఒక బంధువు సాయం అందించేందుకు వెళ్లగా వధువు చిన్నగా నవ్వి, తానే బాగానే ఉన్నానని, వివాహ ఆచారాలకు విలువనిస్తానని చెప్పి, అతడి సాయాన్ని తిరస్కరించింది. 


చైనాలోని చాలా మంది బంగారాన్ని అదృష్టానికి, హోదాకు చిహ్నంగా భావిస్తారు. దుష్టశక్తులను, దురదృష్టాలను వదిలించుకోవడానికి సాయపడుతుందని నమ్ముతారు. పెళ్లిళ్లలో భర్త తరుపు వారు ఇచ్చే నగలను ధరించాలనే ఆచారం కూడా ఉంది. అందుకే అంత బంగారాన్ని వధువు ఓపికగా భరించింది. 


Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం


Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో


Also read: మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్... రెండింటిలో ఏది పెంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి