గడిచిన కొంత కాలంగా ఓటీటీలు జనాల్లోకి బాగా చొచ్చుకుపోతున్నాయి. ప్రజలు కూడా సినిమా థియేటర్లకు వెళ్లకుండా, ఓటీటీల్లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు, రకరకాల షోలను చూస్తున్నారు. ఓటీటీ కంటెంట్ లో ఎక్కువగా ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడుతున్నారని తాజా స్టడీలో తేలింది. యువత సహా చాలా మంది గంటల తరబడి వాటినే చూస్తున్నారట. ఈ నేపథ్యంలో పలు మానసిక సమస్యలకు గురవుతున్నట్లు వెల్లడైంది. నేర సంబంధ సినిమాలు, కంటెంట్ చూసీ, చూసీ యువత మెదళ్లు విపరీత ఆలోచనలకు దారితీస్తున్నాయట. క్రైమ్ కంటెంట్‌ని ఆస్వాదించే వ్యక్తులు నమ్మశక్యం కాని క్రూరత్వానికి ఆకర్షితులవుతున్నారట.
క్రూమ్ క్రైమ్ థ్రిల్లర్స్ తో మానసిక సమస్యలు
చీకటి, గగుర్పాటు కలిగించడంతో పాటు కలవరపెట్టే కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ చూసేందుకు జనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు డాక్యుమెంటరీలు, సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో డార్క్ కంటెంట్ ను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి. వినియోగదారులు సైతం క్రైమ్ సంబంధ కంటెంట్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారట. కొన్ని కల్పిత కథలు, మరికొన్ని డాక్యుమెంటరీలు. ఇంకొన్ని యథార్థ సంఘటనలతో కూడిన నేర సంబంధ కంటెంట్ ఓటీటీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కన్వర్సేషన్స్ విత్ ఎ కిల్లర్: ది టెడ్ బండీ టేప్స్, ఢిల్లీ క్రైమ్, హౌస్ ఆఫ్ సీక్రెట్స్, అబ్డక్టెడ్ ఇన్ ప్లెయిన్ సైట్, మాన్‌స్టర్: ది జెఫ్రీ డహ్మెర్ స్టోరీ లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. వీటితో పాటు ఇంకా చాలా క్రైమ్ కంటెంట్ అందుబాటులో ఉంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ స్టడీ ప్రకారం, నేరపూరిత కంటెంట్ చూడటం అనేది మొదట్లో వినోదం అనిపించినప్పటికీ.. కొంతకాలం తర్వాత వ్యసనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కొంటారని తెలిపింది.
క్రైమ్ థ్రిల్లర్స్ కు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?
క్రైమ్ షోలు వాస్తవానికి నేర ప్రవర్తన ధోరణులను సూచించవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంటెంట్ ప్రజలను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, అవి దారుణమైన ఆలోచననలు చేసే వ్యక్తుల మనస్సులోకి ఈజీగా ఎక్కుతాయి. అంతేకాదు.. అలాంటి కంటెంట్ ని చూసే వ్యక్తులు క్రూరత్వం పట్ల ఈజీగా ఆకర్షించబడుతారు. అంతేకాదు.. స్త్రీల పట్ల నీచ స్వభావాన్ని కలిగి ఉంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటి మూలంగా మహిళలు ఎక్కవగా బాధితులుగా మిగిలిపోతున్నారట.
క్రైమ్ థ్రిల్లర్లను అతిగా చూస్తే ఏం జరుగుతుందంటే?
క్రైమ్ థ్రిల్లర్స్ ను అతిగా చూడ్డం మూలంగా అత్యాచారం, హత్యలపైకి ఆలోచనలు వెళ్తాయట. అదే సమయంలో ఈ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయట. వీటి ప్రభావం బ్రెయిన్ మీద ఎక్కువగా పడటం మూలంగా అన్ని సమయాల్లో భయంగా అనిపిస్తుందట. ఇంట్లో ఉన్నా అసురక్షిత భావన కలుగుతుందట. ఆందోళనతో పాటు చిన్నచిన్న విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన కలుగుతుందట. కొన్నిసార్లు సాధారణ పరిస్థితుల్లో కూడా భయంతో నిద్రపోవడం కష్టం అవుతుందట. టెన్షన్ కలుగుతుందట. అశాంతి, గుండె వేగంగా కొట్టుకోవడం, హైపర్ వెంటిలేషన్, నీరసం ఆవహిస్తాయట.