Tips to Good Sleep for Kids : పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే తల్లిదండ్రులకు కూడా నిద్ర ఉండదు. ఇది చాలా కుటుంబాల్లో రోజువారీ సమస్యగా చెప్పవచ్చు. దీనివల్ల అలసిపోయి మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు కూడా రోజంతా మగతతో ఉంటారు. కానీ కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పిల్లలు హాయిగా, గాఢంగా నిద్రపోతారు. మరి నిపుణులు సూచించే అత్యంత ప్రభావవంతమైన టిప్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

బెడ్ టైమ్ ఇంపార్టెంట్

శరీరానికి గడియారం లాంటి అంతర్గత వ్యవస్థ ఉంటుంది. దాన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. కాబట్టి పిల్లలకు మీరు రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేయాలి. ఈ అలవాటు వల్ల సర్కేడియన్ రిథమ్ సెట్ అయి.. వారికి అదే సమయానికి నిద్రవచ్చేలా చేస్తుంది. వారాంతాల్లో కూడా ఇదే టైమ్ ఫాలో అవ్వండి. 

స్క్రీన్‌లు పూర్తిగా బంద్

మొబైల్, టీవీ, ట్యాబ్లెట్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును మేల్కొలిపే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి నిద్రపోయే కనీసం 1 గంట ముందు అన్ని స్క్రీన్‌లు ఆపేయండి. బదులుగా పుస్తకం చదవడం, కథ చెప్పడం లాంటివి చేయవచ్చు. 

Continues below advertisement

నిద్రకు ముందు రొటీన్..

పిల్లలకు రొటీన్ చాలా ముఖ్యం. ఇది వారికి నిద్రకు రెడీ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. పిల్లలకు స్నానం చేయించడం తర్వాత పాలు తాగించడం.. కథ చెప్పి నిద్రపోవడం అనేది ఓ రొటీన్ అయిపోవాలి. దీనివల్ల పిల్లలు సాయంత్రం స్నానం చేసిన వెంటనే నిద్ర మూడ్‌లోకి వెళ్లిపోతారు.

డిన్నర్

నిద్రపోయే ముందు భోజనం తినిపిస్తే పిల్లల జీర్ణక్రియను దెబ్బతింటుంది. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. దాంతో పిల్లలు మళ్లీ మళ్లీ లేస్తారు. కాబట్టి రెండు గంటల ముందే డిన్నర్ ముగించేయాలి. అలాగే భోజనం తేలికగా ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు వెచ్చని పాలు ఇస్తే మంచిది. 

గదిలో చేయాల్సిన మార్పులు

నిద్రకు అనువైన గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 26 మధ్య ఉండాలి. కాబట్టి ముందుగానే ఫ్యాన్ లేదా AC వేసి గదిలో వేడి తగ్గేలా చూసుకోవాలి. పిల్లలు నిద్రకు వెళ్లినప్పుడు గదిని పూర్తి చీకటిగా చేయాలి. పిల్లలకు భయంగా అనిపిస్తే చిన్న నైట్ లాంప్ వాడవచ్చు.

నిద్రకు ముందు స్టోరి..

పిల్లలకు కథ చెప్పడం వల్ల వారి మనసులోని ఒత్తిడి బయటకు వస్తుంది. తల్లి లేదా తండ్రి గొంతు వినడం వల్ల పిల్లలకు సేఫ్​గా అనిపిస్తుంది. అలాగే మీరు కూడా పిల్లలతో మంచి ర్యాపో మెయింటైన్ చేయగలుగుతారు. పిల్లలు కథలు వింటూ మెల్లగా నిద్రలోకి వెళ్లిపోతారు. 

తేలికపాటి ఫిట్​నెస్

పగలు అవుట్​డోర్ గేమ్స్ ఆడిన పిల్లలు రాత్రుళ్లు గాఢంగా నిద్రపోతారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. సైకిల్ తొక్కడం, బయట ఆడటం, రన్నింగ్ చేయడం వంటివి శరీరాన్ని అలసిపోయేలా చేసి రాత్రి మంచి నిద్రకు దారితీస్తాయి. కానీ నిద్రకు 2 గంటల ముందు ఇలాంటివి చేయించకండి.

పిల్లల నిద్ర కేవలం వారికి, మీకు విశ్రాంతి కోసమే కాదు. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. మంచి నిద్ర అనేది చిన్నప్పటి నుంచే అలవాటు అయితే.. పెద్ద అయ్యాక కూడా వారికి నిద్ర సమస్యలు రాకుండా ఉంటాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.