Anti Aging Tips : జుట్టు, స్కిన్ హెల్తీగా ఉంటే ఎవరైనా అందంగా ఉంటారు. అయితే శరీరంలో ఫోలిక్ యాసిడ్(Folic acid benefits) తక్కువైనప్పుడు మాత్రం జుట్టు రాలిపోతూ.. స్కిన్ డల్‌గా మారిపోతుంది. ఈ లక్షణాలు మీరు గుర్తిస్తే వెంటనే మీ శరీరంలో ఫోలిక్ యాసిడ్ ఎంతుందో టెస్ట్ చేయించుకోవాలి. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏమిటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీనినీ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది..
ఫోలిక్ యాసిడ్(విటమిన్ బి9) శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు.. సెల్యూలార్ మెటబాలీజంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఆహారంలో దొరికితే ఫోలేట్ అని.. సప్లిమెంట్స్‌గా తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ అని అంటారు. ఇది జుట్టు, గోళ్లు, స్కిన్‌ను ఎక్కువ కాలం హెల్తీగా ఉంచుతుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు లేట్‌గా వస్తాయి. అందుకే ఇది శరీరానికి చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు.
కొల్లాజెన్‌ను పెంచుతుంది..
ఫోలిక్ యాసిడ్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. తేమను నిల్వ ఉంచి.. రంగుని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పొడిబారడాన్ని తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. అంతేకాకుండా మొటిమలను తగ్గిస్తుంది. శరీరాన్ని, చర్మాన్ని డిటాక్స్ చేసి.. మెరుగైన గ్లోని అందిస్తుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు స్కిన్‌ని రక్షిస్తుంది.
ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది..
ఫోలిక్ యాసిడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరంలో కొత్త, హెల్తీ కణాల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఇది మీరు యంగ్‌గా ఉండడంలో సహాయం చేస్తుంది.
జుట్టును హెల్తీగా చేస్తుంది..
జుట్టు రాలడాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. వైట్ హెయిర్‌ను దూరం చేస్తుంది. మీకు ఫోలేట్ లోపం ఉంటే.. జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే ఇప్పటికే జుట్టు ఎక్కువగా రాలిపోతే ఫోలిక్ యాసిడ్‌ని తీసుకున్నా పెద్ద ఉపయోగముండదంటున్నారు నిపుణులు. జింక్, మెగ్నీషియం లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. బయోటిన్, జింక్, అమైనో యాసిడ్స్ వంటి సప్లిమెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.
ఎవరు తీసుకోవచ్చు..
మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలా? ఏ మోతాదులో తీసుకోవాలి? వంటి సందేహాలున్నాయా? అయితే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పినట్లుగా 20 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు రోజు 400 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి ఈ డోస్‌లో మార్పులుంటాయి. అయితే వీటిని నేరుగా తీసుకోకుండా వైద్యుల సలహాతో తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఫోలిక్ యాసిడ్ మంచి ప్రయోజనాలు అందించడంతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉన్నాయి. దీనిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. చర్మాన్ని పొడి బారేలా చేసి.. మొటిమలు ఎక్కువ అవ్వడానికి కారణమవుతుంది. ఆకు కూరలు, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, మంసాహారాలలో ఎక్కువగా ఉంటుంది. గుడ్లు, సోయాబీన్స్ బఠానీలు కూడా మంచి ఆప్షన్సే.
Also Read : శ్రావణమాసం స్పెషల్ ఆవ పులిహోర.. నోరూరించే సింపుల్ రెసిపీ ఇదే