బిర్యానీకి అంత రుచి రావడానికి ప్రధాన కారణం మసాలాలే కావచ్చు, కానీ అందులో వాడే బాస్మతి బియ్యం కూడా ముఖ్య కారణమే. బాస్మతి బియ్యం ఖరీదు ఎక్కువ. అందరూ కొనుక్కుని తినలేరు. అలాంటి వారికి బాస్మతిలాంటి ఫ్లేవర్‌ను అందించే ఆకులు ఉన్నాయి. అవే పాండన్ ఆకులు. వీటిని ‘అన్నపూర్ణ ఆకులు’ అని కూడా అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ వంటకాల్లో ఈ ఆకులు ప్రాచుర్యం పొందాయి. ఈ ఆకులు సహజంగానే సువాసనను కలిగి ఉంటాయి. అందుకే ప్రముఖ బ్రిటీష్ రచయిత్రి నిగెల్లా లాసన్ ఈ ఆకులను ఐరోపాలోని వంటల్లో ముఖ్యమైనదిగా చెప్పుకొచ్చారు. ఈ ఆకులను పానీయాలు, జెల్లీల తయారీలో కూడా అద్భుతమైన రుచి కోసం జోడిస్తారు.
ఉడుకుతున్న అన్నంలో
'ఆగ్రో ఫుడ్ ఇండస్ట్రీ హై టెక్' అనే పుస్తకంలో ప్రచురించిన కథనం ప్రకారం ఈ పాండన్ ఆకులపై ఓ అధ్యయనం సాగింది. ఈ అధ్యయనంలో ఆకుల్లో బాస్కతి బియ్యానికి చెందిన ఫ్లేవర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. వీటిని బియ్యం భద్రపరిచే డబ్బాల్లో వేస్తే వీటి సువాసన ఆ బియ్యానికి అంటుకుంటుంది. లేదా అన్నం ఉడుకుతున్నప్పుడు దాదాపు 70 శాతం ఉడికేశాక ఈ ఆకులను శుభ్రంగా కడిగి అన్నం గిన్నెలో వేసినా చాలు బాస్మతి బియ్యంలా వాసన ఘుమఘుమలాడిపోతుంది. సాధారణ బియ్యంతో బిర్యానీ వండినా కూడా ఈ పాండన్ ఆకులను కలపడం వల్ల అది బాస్మతి బియ్యంతో వండిన బిర్యానీలా మంచి సువాసన వీస్తుంది.
ఎన్నో పోషకాలు
ఈ ఆకుల్లో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. తినే ముందు ఈ ఆకులను తీసి పడేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే వీటిని వేయడం వల్ల ఇందులో ఉండే సుగుణాలన్నీ అన్నంలోకి చేరిపోతాయి. గ్లైకోసైడ్లు ఆల్కలాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు కూడా అధికంగా ఉన్నాయని అంటారు. ఈ ఆకులలో ఉండే పోషకాహారం కారణంగా, ఈ ఆకులను సాంప్రదాయకంగా నొప్పి, జ్వరాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు.మలబద్ధకం చికిత్సకు ఆయుర్వేద మందులలో ఈ ఆకులను ఉపయోగిస్తారు.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఈ పాండన్ ఆకుల వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటితో అనేక చర్మ సమస్యలకు చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా మొటిమలను నివారిస్తుంది. కాలిన గాయాలు, మచ్చలను పోగొడుతుంది. చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నిరోధిస్తుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో కూడా ఇది ముందుంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి ఈ ఆకులు ఎంతో మేలు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉండేట్టు చూస్తాయి ఈ ఆకులు.
Also read: బిర్యానీల్లో వాడే ఈ మసాలా పేరేంటో తెలుసా? అది మొక్కల నుంచి రాదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.