బిర్యానీ అంటే ఎంతో మందికి ప్రాణం. ఆ వాసనకే నోరూరిపోతుంది చాలా మందికి. బిర్యానీ పర్‌ఫెక్ట్‌గా వండే వాళ్లకు అందులో వాడే మసాలా దినుసులు గురించి తెలుస్తుంది. బిర్యానీకి రుచికరమైన ఫ్లేవర్ రావడానికి నలుపు తెలుపులు కలగలిసిన రంగులో ఉన్న ఓ సుగంధ ద్రవ్యం చాలా అవసరం. అదే దగడ పువ్వు. దీన్ని ఆంగ్లంలో ‘బ్లాక్ స్టోన్ ఫ్లవర్’ అంటారు. ఈ పదార్థాన్ని చూసి అందరూ మొక్కల నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ ఇది మొక్కజాతి కాదు. దాదాపు పుట్టగొడుగుల్లాంటివే. అంటే ఫంగస్‌లన్న మాట. పెద్ద పెద్ద చెట్ల కాండాలపై పెరిగే ఒక రకమైన ఫంగస్ ఇది. చెట్టుపై పెరుగుతున్నప్పుడు ఇది ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఈ ఫంగస్‌ను లైకెన్ అంటారు. ఇది చెట్లపైనే కాదు రాళ్లపై కూడా నాచులా పెరుగుతుంది.
దగడపువ్వునే కల్పసి అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. బిర్యానీలు, మాంసాహార వంటల్లో దీన్ని కచ్చితంగా వినియోగిస్తారు. చెట్టినాడ్ వంటల్లో కచ్చితంగా వాడే పదార్థం ఇది. దీన్ని ముక్కుతో వాసన పీల్చడం వల్ల మీకు దాని ఫ్లేవర్ తెలియదు. కానీ వంటల్లో కలిపి వండితే రుచి రెట్టింపు అవుతుంవది. ఇది వేడికే ప్రతిస్పందిస్తుంది. వేడి పదార్థానికి జతచేరినప్పుడు సువాసనను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా వేడి నూనె లేదా నెయ్యిలో వేసినప్పుడు ఘుమఘమలాడుతుంది. ఇది ఆహారానికి ప్రత్యేకమైన స్మోకీ సువాసనను అందిస్తుంది. కొన్నిసార్లు మట్టి వాసనను కూడా అందిస్తుంది.
తినడం వల్ల లాభాలు
లైకెన్ లేదా దగడపువ్వు ఎలా పిలుచుకున్నా ఇది మన శరీరానికి మేలే చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది యాంటీ-వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. ఇది ఇంగగువ, అజినమోటోలానే రుచి కోసం వాడతారు. ఆహారం మెరుగ్గా జీర్ణం అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శరీరానికి తగిలిన దెబ్బలను త్వరగా నయమయ్యేలా చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి. కాలేయం, పొట్ట, గర్భాశయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. పొట్టలో అధికంగా గ్యాస్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. అలాగని దీన్ని అధిక మొత్తంలో వేసుకుని వండితే ఎన్నో ఆరోగ్య నష్టాలు వస్తాయి. కాబట్టి కూరల్లో, బిర్యానీలో చేత్తో నలిపేసి కాస్త కలుపుకుంటే చాలు. మంచి రుచితో పాటూ, ఆరోగ్యం కూడా.
Also read: దీర్ఘకాలం నుంచి శరీరం దురద పెడుతోందా? అది క్యాన్సర్ కూడా కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.