చెవులు కుట్టించడం ఎప్పుడు ప్రారంభమైంది? వందల ఏళ్ల క్రితం మన పూర్వీకులు మొదలుపెడితే వాటిని ఆచారంగా అలా ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. అప్పట్లో అబ్బాయిలు, అమ్మాయిలూ ఇద్దరికీ కుట్టించేవారు. ఆధునిక కాలంలో మాత్రం కేవలం అమ్మాయిలకే కుట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఆభరణాలు పెట్టుకునే అలంకరణగా మిగిలిపోయింది. నిజానికి దీని ఉద్దేశం మాత్రం వేరు అంటోంటి ఆయుర్వేదం. చెవులు కుట్టించడం మనకు తెలియకుండానే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయిట.
మెదడుకు మేలు
చెవి కుట్లు అనేవి పిల్లలకు చిన్న వయసులోనే జరిగే ప్రక్రియ. కొంతమంది 7వ నెల, 9వ నెల, 11వ నెల ఇలా వారి ఇంటి ఆచారాలకు తగ్గట్టు కుట్టిస్తారు. చెవి కుట్టించడం వల్ల మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. చెవి తమ్మెలో ఉండే మెరిడియన్ పాయింట్లు మెదడుకు కనెక్ట్ అయి ఉంటాయి. చెవి కుట్టించడం వల్ల మెదడులోని కొన్ని ప్రాంతాలు చురుగ్గా మారతాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పునరుత్పత్తి వ్యవస్థకు...
ఆయుర్వేదం ప్రకారం చెవి తమ్మెలో ముఖ్యమైన మర్మ బిందువు ఉంటుంది. సరిగ్గా ఇది తమ్మె మధ్యలో ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులలో పునరుత్పత్తి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పరిగణిస్తారు. అక్కడే చెవి కుట్టడం వల్ల స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుందట, అలాగే ప్రసవ సమయంలో కూడా వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయిట.
శక్తిని పెంచుతుంది
ఒక వ్యక్తి చెవిపోగులు ధరిస్తే శక్తి ప్రవాహం శరీరంలో చక్కగా జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. పూర్వకాలంలో ఆడ, మగ... ఇద్దరికి చెవులు కుట్టించడానికి ఇదే కారణం.
రోగనిరోధక శక్తికి...
చెవులు కుట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెవి తమ్మె మధ్య భాగం శరీరంలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. మహిళలకు శరీరంలో చాలా నొప్పులను భరించే శక్తిని ఇస్తుందట.
కంటిచూపుకు...
మెరుగైన కంటిచూపుకు చెవి కుట్టుకు సంబంధం ఉందంటోంది ఆయుర్వేదం. చెవి తమ్మె మధ్య భాగం కంటి దృష్టితో ముడిపడి ఉంటుంది. అంటే కంటికి మేలు చేసే ఒత్తిడి పాయింట్ చెవి తమ్మె అన్న మాట. ఆక్యుపంక్చర్ చేసేటప్పుడు చెవి తమ్మెను నొక్కితే ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. ఈ తమ్మె వద్ద చెవి కుట్టు వేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
జీర్ణ ఆరోగ్యానికి...
ఆయుర్వేదం ప్రకారం చెవి తమ్మె ఒత్తిడి పాయింట్లను కలిగి ఉంటుంది. తమ్మెపై ఒత్తిడిని కలుగజేయడం వల్ల ఆకలి కూడా పుడుతుందట. చెవికుట్లు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Also read: రొయ్యల ఫ్రైడ్ రైస్, ఇంట్లోనే ఇట్టే చేసేయచ్చు
Also read: హ్యాపీ మూడ్ కావాలా? అయితే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.