‘డర్టీ మైండ్’ ఉండేవాళ్లను మనం చాలా చెడ్డగా చూస్తాం. ఛీ.. వీళ్లకు ఎప్పుడే అదే పనా? ఎప్పుడూ అదే ఆలోచనలా అని తిట్టుకుంటాం... ఆశ్చర్యపోతాం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో పూజా హెగ్డే ‘డర్టీ’ టాక్ చూసి.. చాలామందికి ‘మైండ్’ బ్లాకై ఉంటుంది. అయితే, ఆమె చెప్పిన కొన్ని విషయాల్లో కూడా నిజాలు ఉన్నాయ్. పెళ్లయిన జంటకు ‘డర్టీ మైండ్’ లేకపోతే.. జీవితాంతం రొమాంటిక్‌గా కలిసి ఉండలేరని, రొమాన్స్ లేని లైఫ్ యాంత్రికంగా ఉంటుందనేది పూజా హెగ్డే పాత్ర ద్వారా దర్శకుడు చూపించాడు. భార్యభర్తల మధ్య రొమాన్స్ అటకెక్కితే.. ఇద్దరిలో ఒకరు దారి తప్పే ప్రమాదం ఉందని, ఇంట్లో ఇల్లాలిని వదిలి.. కొత్త సుఖాల కోసం అన్వేషిస్తారనేది అతడు చెప్పాలనుకున్న పాయింట్.
అయితే, జీవితం లేదా దాంపత్యమంటే కేవలం సెక్స్, రొమాన్స్ మాత్రమే కాదు.. నమ్మకం కూడా. సినిమాల్లో చూపించినట్లుగా అంతా దారి తప్పుతారని భావించకూడదు. సెక్స్ లేకపోయినా హాయిగా కలిసి జీవించేవాళ్లు కూడా ఉన్నారనేది మరో వాదన. అయితే, సెక్స్ అనేది ‘డర్టీ’ పని కాదు. అది అవసరం. ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషదం.. శరీరానికి మంచి వ్యాయామం. సెక్స్ జీవితం ఆలుమగల మధ్య బాంధవ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మన దేశంలో చాలామంది సెక్స్‌ను కేవలం పిల్లలు కనడం కోసమే అనుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు. పిల్లల బాధ్యతలు పెరగడం, మానసిక ఆందోళన, స్పర్థలు తదితర కారణాల వల్ల కాలక్రమేనా అంతా సెక్స్‌ను దూరం చేసుకుంటారు. అయితే, వయస్సు మీదపడే కొద్ది సెక్స్ సామర్థ్యం సన్నగిల్లుతుందా? లేదా కావాలనే సెక్స్‌కు దూరంగా ఉంటారా? దీనిపై పలు అధ్యయనాలు ఏం చెప్పాయో చూడండి.
వయస్సు పెరిగినా సామర్థ్యం ఉంటుంది: వయస్సు పెరిగే కొద్ది సంతాన సమస్యలు పెరగవచ్చేమో.. కానీ, సెక్స్ సామర్థ్యం మాత్రం తగ్గదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే.. సెక్స్ చేయడానికి కావాల్సినంత పవర్ పురుషుల్లో ఉంటుంది. కానీ, దాన్ని సద్వినియోగం చేసుకోరు. అయితే, ఒకే పార్టనర్‌తో పదే పదే సెక్స్‌ను బోరింగ్‌గా ఫీలై కొత్త రుచులను అన్వేషించేవారి సంఖ్య పెరుగుతుంది. అలాంటివారిలో పురుషులే అధికమని లెక్కలు చెబుతున్నాయి. పురుషుల్లో వయస్సు పెరిగినా సెక్స్ కోరికలు మాత్రం సజీవంగా ఉండమే ఇందుకు కారణం.
55 ఏళ్ల వరకు.. నాట్ ఔట్: బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన చికాకో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. పురుషుల్లో సెక్స్ సామర్థ్యం సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుంది. ఆరోగ్యవంతమైన పురుషుల్లో ఆ సామర్థ్యం మరో ఐదు నుంచి ఏడేళ్లకు పైగానే ఉంటుంది. అయితే, మహిళల్లో మాత్రం ఇది కాస్త తక్కువే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 55 ఏళ్ల పురుషుడు 11 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్లు సెక్స్‌లో చురుగ్గా ఉండాలని కోరుకుంటే.. అదే వయస్సు ఉన్న మహిళలు మాత్రం కేవలం మరో 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటే చాలని అనుకుంటారట. చిత్రం ఏమిటంటే.. పార్టనర్ లేదా భర్తలేని మహిళల్లో మాత్రం లైంగిక కోరికలు సజీవంగా ఉంటాయట.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లా ఎందుకు ఉండాలంటే..: మన దేశంలో నిర్వహించే పెళ్లిల్లో అబ్బాయిలకు ఎక్కువ వయస్సు, మహిళలకు తక్కువ వయస్సు ఉండటమే ఇందుకు కారణం. కొంతమంది పురుషుల్లో వయస్సు పెరిగే కొద్ది అనారోగ్య కారణాలతో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. అయితే, వారి కంటే తక్కువ వయస్సులో ఉండే మహిళల్లో మాత్రం కోరికలు అలాగే ఉంటాయి. ఇది అక్రమ సంబంధాలకు దారితీస్తోందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒకే వయస్సు లేదా ఒకటి రెండు ఏళ్ల వయస్సు వ్యత్యాసం గల జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం ఉంటుందని, దాదాపు ఒకే జనరేషన్ కావడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారని అంటున్నారు. ‘డర్టీ మైండ్’ ఉండే కపుల్స్.. సెక్స్‌ను ఎంజాయ్ చేయడం ద్వారా మరింత చురుగ్గా ఉంటారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి.. మీరు పెళ్లికి ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కావచ్చు. కానీ, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యతో జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే.. మీరు తప్పకుండా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లా ఉండాలి. కాబట్టి.. పెళ్లి విషయంలో ‘డర్టీ మైండ్’ మంచిదే.
ఈ వాస్తవాలు కూడా తెలుసుకోండి: అమ్మాయిల కంటే అబ్బాయిలకే సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంటుందని పొంగిపోవద్దు. ఇది కేవలం మీ ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీ వయస్సు పెరిగే కొద్ది మీలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవి మీ పడక గదిలో ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. మీరు సెక్స్ గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు లేదా మీ అంగస్తంభనలు అంత గొప్పగా ఉండకపోవచ్చు. మీరు యవ్వనంలో చేసినంత క్రేజీగా సెక్స్‌ను ఎంజాయ్ చేయకపోవచ్చు. గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ సమస్యలకు పరిష్కారాలున్నాయి. మీ లైంగిక జీవితం సాఫీగా సాగాలంటే.. మానసిక ఆందోళనలు దూరం పెట్టాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ శరీరంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వైద్యుల సూచనలు తీసుకోవాలి.
టెస్టోస్టెరాన్ తగ్గితే.. బండి బోరుకొచ్చినట్లే: టెస్టోస్టెరాన్ (వృషణాల స్రావం) అనేది పురుషుల్లో సెక్స్ డ్రైవ్‌ను యాక్టీవ్‌గా ఉంచే హార్మోన్. 40 ఏళ్ల తర్వాత పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు క్షీణించడం ప్రారంభం అవుతుంది. చాలా మంది పురుషులలో సెక్స్ కోరికలు(లిబిడో)తో పాటు టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. మీకు సెక్స్ పట్ల ఆసక్తి తగ్గినా, అంగస్తంభన సమస్యలు ఏర్పడినా.. టెస్టోస్టెరాన్ తగ్గినట్లు గుర్తించాలి. టైప్ 2 డయాబెటిస్, లివర్ సిర్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్మోన్ డిజార్డర్స్, వృషణాల సమస్య, కొన్ని జన్యుపరమైన పరిస్థితులు.. టెస్టోస్టెరాన్‌ను తగ్గించేస్తాయి. అయితే, కొన్ని ఔషదాల ద్వారా హార్మోన్ స్థాయిలను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అతిగా బరువులు ఎత్తినా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా టెస్టోస్టెరాన్ క్షీణిస్తుంది.
ఎలా తెలుసుకోవచ్చు?: టెస్టోస్టెరాన్ స్థాయిలను సాధారణ లక్షణాలతో తెలుసుకోవడం కష్టమే. అయితే.. రక్త పరీక్ష ద్వారా వాటి స్థాయిలను అంచనా వేయొచ్చు. లక్షణాలు బయటపడితే.. టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (TRT) ద్వారా వాటిని పెంచుకోవచ్చు. మీ సెక్స్ డ్రైవ్‌ను సాధారణ స్థితికి తీసుకురావడంలో ఇది సహాయపడుతుంది. TRT ప్యాచ్ లేదా జెల్ రూపంలో దీర్ఘకాలిక ఇంప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ వైద్యాన్ని అందరికీ సూచించరు. కొన్ని వైద్య కారణాల వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు మరీ తక్కువగా ఉండే పురుషులకు మాత్రమే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ కారణం చేత వృద్ధాప్యం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్సను సూచించడం లేదు. ఎందుకంటే.. టెస్టోస్టెరాన్ చికిత్స తీసుకొనే రోగులకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే Food and Drug Administration (FDA) కూడా ఈ చికిత్సపై ఆంక్షలు విధిచింది.
Also Read: మూడ్ రావాలంటే మల్లెపూలే అక్కర్లేదు.. ఇవి కూడా మత్తెక్కిస్తాయ్!
అంగస్తంభన సమస్యలు: పురుషుల్లో వయస్సు పెరిగే కొద్ది Erectile Dysfunction (ED) సర్వసాధారణం అవుతుంది. అంగస్తంభన జరగాలంటే.. పురుషాంగానికి రక్త ప్రవాహం సక్రమంగా ఉండాలి. లేకపోతే అంగం గట్టిపడదు. కేవలం వయస్సు వల్లే కాదు.. మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు వల్ల అంగ సమస్యలు వస్తాయి. తగిన వ్యాయమం చేయడమే కాకుండా స్మోకింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా అంగ స్తంభన సమస్యల నుంచి బయటపడొచ్చు. ఒత్తిడి, ఆందోళన, పురుషాంగానికి గాయాలు, హార్మోన్ సమస్యలు కూడా అంగస్తంభనకు విలన్స్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని మందులు ఉన్నాయి. అవి పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా అంగస్తంభనలకు సహాయపడతాయి. శస్త్రచికిత్స, వాక్యూమ్ పరికరాలు, పెనైల్ ఇంజెక్షన్లు, ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: ఎక్కువ సేపు శృంగారం చేయాలని ఉందా? ఇలా చేస్తే మీరే ఛాంపియన్!
ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (BPH) అంటే?: వృద్ధాప్యంలో ఎక్కువగా వచ్చే ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (BPH) సమస్య కూడా ఇందుకు సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. BHP అనేది క్యాన్సర్ కాదు. కానీ, కొన్ని లైంగిక సమస్యలు కలిగిస్తుంది. ముఖ్యంగా 50 ఏళ్ల వయస్సు తర్వాత ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. BPH తరచుగా మూత్రవిసర్జన చేయడాన్ని కష్టతరం చేస్తుంది. దీనివల్ల పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ లక్షణాలను లోయర్ యూరినరీ ట్రాక్ట్ లక్షణాలు (LUTS) అని అంటారు. ఈ లక్షణాల వల్ల కొందరిలో శీఘ్ర స్కలన సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య వల్ల పురుషుల్లో సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. కాబట్టి.. పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి కేవలం వయస్సు మాత్రమే కాదు.. అనారోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి. అయితే, వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా.. సానుకూల ఆలోచనలతో ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ఉంటేనే ఆటలోనైనా.. సయ్యాటలోనైనా విజేతగా నిలిచేది. కాబట్టి.. మీ డర్టీ ఆలోచనలు మీ పార్టనర్‌తో పంచుకుని సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి.
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి