Tips To Control Asthma During Winters : ఆస్తమా దీనినే ఉబ్బసం అని కూడా అంటారు. మనిషికి దీర్ఘకాలికంగా ఊపిరి అందకుండా చేసే శ్వాసకోశ వ్యాధి. పిల్లల నుంచి పెద్దల వరకు వయసు తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లల్లో జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ప్రభావితం చేస్తే.. పెద్దల్లో దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం, మానసిక ఆందోళన, వ్యాయామం వంటి మొదలైన అంశాలు ట్రిగర్ చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ ఆస్తమా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో చల్లనిగాలి.. గాలి నాణ్యతలో క్షీణింపు వంటివి ఆస్తమా ప్రభావాన్ని పెంచుతాయి. కాలుష్య కారకాలకు గురై.. శ్వాసనాళాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయి. సెన్సిటివ్‌గా మారి.. వాపు కలుగుతుంది. అందుకే శీతాకాలంలో ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఆస్తమాను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? ఆస్తమాను కంట్రోల్ చేయడంలో అవి ఏవిధంగా హెల్ప్ అవుతాయో చూసేద్దాం.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
వెచ్చగా ఉండేందుకు : చలికాలంలో చల్లదనాన్ని, చలిగాలుల నుంచి కాపాడుకునేందుకు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వెటర్స్ ధరించడమే కాకుండా లేయరింగ్ పద్ధతిలో దుస్తులు వేసుకోవాలి. చేతులకు గ్లౌవ్‌లు కచ్చితంగా వాడాలి. కాళ్లకు చలి తగలకుండా షూలు వేసుకోవాలి. బయటకు వెళ్తే తలని స్కార్ఫ్ లేదా టోపీతో కవర్ చేయాలి. ముఖానికి మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల చల్లగాలి ప్రభావం తగ్గుతుంది. ఆస్తమా ప్రభావం తగ్గే అవకాశాలు ఎక్కువ.
హ్యూమిడిఫైర్ : వింటర్లో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. పొడిగాలి ఆరోగ్యాన్ని వివిధరకాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు దీని ఎఫెక్ట్ ఎక్కువగా చూస్తారు. కాబట్టి గాలిలో తేమను పెంచేందుకు, చికాకును తగ్గించేందుకు హ్యూమిడిఫైర్ని ఉపయోగించాలి. ఇది పొడిగాలిని తగ్గించి.. శ్వాసనాళాలపై ప్రతికూల ప్రభావం లేకుండా హెల్ప్ చేస్తుంది.
వ్యాయామం : ఇంట్లో చేయగలిగే వ్యాయామాలు చేయాలి. ఇవి మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచి.. వేడిగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఆస్తమా సమస్యలు రాకుండా చేస్తాయి. యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ఎరోబిక్స్ వంటివి శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. మెడిటేషన్ ఒత్తిడిని తగ్గించి.. ఆస్తమా ప్రభావాన్ని తగ్గిస్తుంది.
హైడ్రేషన్ : ఏకాలంలోనైనా హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు చలికాలంలో నీరు తాగడాన్ని అస్సలు మరచిపోకూడదు. హైడ్రేట్డ్గా ఉండడం వల్ల పొడిగాలి ప్రభావం ఎక్కువగా ఉండదు. చర్మానికి, జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి.
ట్రిగర్స్ : ఆస్తమాను ట్రిగర్ చేసే కొన్ని అంశాలు ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కో అంశం ప్రభావితం చేస్తుంది. కొందరిని స్మోకింగ్ ట్రిగర్ చేస్తే.. మరికొందరిని పొడిగాలి, ఫుడ్ కూడా ట్రిగర్ చేస్తుంది. దుమ్ము, కాలుష్యం కూడా ఆస్తమాకు ట్రిగరింగ్ పాయింట్స్‌గా చెప్పొచ్చు. ఇలా అనేకరకాల ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అలాగే ఏ పని చేసినా.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
Also Read : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్
మందులు : ఆస్తమాను కంట్రోల్ చేసేందుకు వైద్యులు సూచించే మందులు కచ్చితంగా ఉపయోగించాలి. ఇన్హేలర్ని మీకు అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్తమా ట్రిగర్ అయిన సమయంలో ఇన్హేలర్ని కచ్చితంగా ఉపయోగించాలి.
ఈ అంశాలన్నీ చలికాలంలో ఆస్తమాను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. వైద్యులు, నిపుణుల సూచనలు తీసుకుంటే మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
Also Read : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.