Smart Card Driving License: ప్రపంచం మొత్తం డిజిటల్‌గా మారుతున్న నేపథ్యంలో, పాత పద్ధతులు, విధానాలు & వస్తువులను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఉదాహరణకు, డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్‌గ్రేడ్ చేసి స్మార్ట్ కార్డ్‌లా మార్చారు. పాత డ్రైవింగ్ లైసెన్స్ ఒక నోట్ బుక్ లేదా బుక్‌లెట్‌లా కనిపిస్తుంది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌లా మారిపోయింది. కొత్త తరం డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌లోని అతి కీలక ఫీచర్ ఏమిటంటే, దానిలో మైక్రో ప్రాసెసర్ చిప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. డ్రైవర్‌కు సంబంధించిన కీలక సమాచారం ఆ చిప్‌లో దాగి ఉంటుంది. ఈ కారణంగా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది వ్యక్తిగత గుర్తింపు కార్డు (Personal Identity Card) కంటే ఏ మాత్రం తక్కువ కాదు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ఏ వ్యక్తి అయినా డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి. ఈ రూల్ పాటించని పక్షంలో చట్ట ప్రకారం జరిమానా విధిస్తారు.
మైక్రోచిప్‌లోని డేటాను మార్చొచ్చా?
డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ మీద ఉండే మైక్రో చిప్‌లో, సంబంధిత వ్యక్తి వేలిముద్రలు (Biometric), బ్లడ్ గ్రూప్ (Blood Group), కంటిపాపలు (Iris) వంటి కీలకమైన వ్యక్తిగత సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. పోలీసులు లేదా మోటారు వాహన అధికారుల తనిఖీ సమయంలో ఈ చిప్‌ను స్కాన్ చేసిన వెంటనే డ్రైవర్‌కు సంబంధించిన మొత్తం సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ మైక్రోచిప్‌లో ఎన్‌క్రిప్టెడ్ డేటా ఉంటుంది. దీనిని ఎవరూ తారుమారు చేయలేరు, ఒకరి పేరిట మరొకరి కార్డ్‌ను ఉపయోగించలేరు.
మీకు స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా?
మీకు స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే, దానికోసం ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ రెండు మార్గాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడం కోసం - సారథి పరివాహన్ వెబ్‌సైట్ https://parivahan.gov.in/ లోకి వెళ్లి ఆన్‌లైన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే డ్రాప్-డౌన్ మెనూలోని డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రాష్ట్రం, RTO ఏరియాను ఎంచుకోండి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు పూరించి, సబ్మిట్ చేయండి.
మొదటిసారి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇలా అప్లై చేయండి...
మీరు డ్రైవింగ్ లైసెన్స్ (DL) కోసం మొదటిసారి దరఖాస్తు చేస్తుంటే - న్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీకు ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, దానిని దాటవేయండి. ఆ తర్వాత, మీ మొత్తం సమాచారాన్ని పూరించండి. స్కాన్ చేసిన వ్యక్తిగత గుర్తింపు రుజువు పత్రం, వయస్సు రుజువు పత్రం, నివాస ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయండి. దీని తర్వాత, మీ ఫోటో & సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. DL పరీక్ష స్లాట్‌ను బుక్ చేయండి & సంబంధిత ఫీజును చెల్లించండి. ఆ తర్వాత, మీరు బుక్ చేసిన స్లాట్ టైమ్ ప్రకారం DL పరీక్ష కోసం RTO ఆఫీస్‌కు వెళ్లండి. ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణత సాధిస్తే డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది.
మరో ఆసక్తికర కథనం: మీ వీలునామాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల డేటా కూడా ఉండాలి - చిన్న నిర్లక్ష్యం ఖరీదు భారీ మూల్యం కావచ్చు!