Post Office Deposit Schemes Interest Rates: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వాళ్లకు కొత్త సంవత్సరం 2025లో మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుందా? సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచుతుందా?. దేశవ్యాప్తంగా, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఇన్వెస్టర్లలో ఉన్న ప్రశ్నలు ఇవి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి కాలం) కొత్త వడ్డీ రేట్లను అతి త్వరలో ప్రకటిస్తుంది.
డిసెంబర్ 31న వడ్డీ రేట్లపై నిర్ణయం
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి, పోస్టాఫీస్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీ రేట్లను 31 డిసెంబర్ 2024న ప్రకటిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు, గతంలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్లే ఇప్పుడూ అమలవుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా.. జనవరి 01, 2025 నుంచి మార్చి 31, 2025 వరకు ఉండే నాలుగో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా అని పెట్టుబడిదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు
మూడో త్రైమాసికంలో, సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నారు. దీంతో పాటు.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై (SCSS) 8.2 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్‌పై (NSC) 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రపై (Kisan Vikas Patra) 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4 శాతం, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం, 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం, 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7.1 శాతం, 5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ ఆదాయం అందుతోంది.
పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. కానీ, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదారులు 8.2 శాతం వడ్డీ తీసుకుంటున్నా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీని మాత్రమే పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, కనీసం కొత్త ఏడాదిలోనైనా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడిదారులకు వడ్డీ రేట్ల పెంపును ప్రభుత్వం బహుమతిగా ఇస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
డిసెంబరు మొదటి వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీని ప్రకటించే సమయంలో, తన పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రజలకు ఉపశమనం కలిగించే అంశం. అయితే, ప్రపంచంలోని చాలా దేశాల్లో వడ్డీ రేట్లను తగ్గించే ప్రక్రియ మొదలైంది. 2025 ఫిబ్రవరిలో, భారతీయ కేంద్ర బ్యాంక్ తన రెపో రేటును తగ్గించే నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ విశ్వసిస్తోంది. ఈ పరిస్థితిలో, నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేట్లలో మార్పు ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: మీ వీలునామాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల డేటా కూడా ఉండాలి - చిన్న నిర్లక్ష్యం ఖరీదు భారీ మూల్యం కావచ్చు!