డెంగ్యూ ఫీవర్ ఈ మధ్య కాలంలో జడలు విప్పుతోంది. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జ్వరం గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. డెంగ్యూ జ్వరం ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ జ్వరం వస్తే తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, కండరాలు. కీళ్ల నొప్పులు.. కొన్ని తీవ్రమైన కేసుల్లో రక్తస్రావం, షాక్‌ సైతం సంభవించి ప్రాణాంతకమవుతుంది. డెంగ్యూ జ్వరం దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ దోమ రోగిని కుట్టినప్పుడు, ఆ వైరస్ ఆ వ్యక్తి రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.


డెంగ్యూ జ్వరం లక్షణాలు:


డెంగ్యూ జ్వరం  లక్షణాలు సాధారణంగా వ్యాధిసోకిన తర్వాత నాలుగు నుంచి ఆరు రోజుల్లో ప్రారంభమై 10 రోజుల వరకు ఉంటుంది. తీవ్రమైన జ్వరం (105 డిగ్రీలు వరకూ వచ్చే అవకాశం), తీవ్రమైన తలనొప్పి, కళ్ళు ఎర్రబడటం, తీవ్రమైన  కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు, అతిసారం, స్కిన్ రాష్ కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తేలికపాటి రక్తస్రావం (ముక్కు, చిగుళ్ళలో రక్తస్రావం జరగవచ్చు). డెంగ్యూ సోకినప్పుడు కొన్ని సందర్భాల్లో రక్త నాళాలు దెబ్బతినడం, లివర్ ఫెయిల్యూర్  వంటి అరుదైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS) అంటారు.


డెంగ్యూ జ్వరం నిర్ధారణ పరీక్షలు ఇవే:


డెంగ్యూ జ్వరాన్ని నిర్ధారించడానికి వైద్యులు రక్త పరీక్ష చేయించుకోమని సూచిస్తారు. CBC లేదా CBP - రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. డెంగ్యూ సోకినప్పుడు రక్తంలోని హిమోగ్లోబిన్,ఎర్ర రక్త కణాల (RBC) సంఖ్య తగ్గుతుంది. దీన్ని గుర్తించేందుకే ఈ పరీక్ష చేయించుకోమని సూచిస్తారు.


డెంగ్యూ సెరోలజీ పరీక్షలు:


ఒక వ్యక్తి వైరస్‌కు గురైనప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసిన యాంటీబాడీస్ గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు. ప్రైమరీ ఇన్ఫెక్షన్‌కు గురైన తర్వాత ఈ పరీక్షలు అవసరం పడతాయి.


డెంగ్యూ వైరస్ యాంటిజెన్ డిటెక్షన్ (NS1):


డెంగ్యూ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ని నిర్ధారించడానికి, ఈ పరీక్ష డెంగ్యూ ఇన్‌ఫెక్షన్‌ను ముందుగానే నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ తర్వాత 1-2 రోజులలోపు చేయించుకోవచ్చు.


డెంగ్యూ జ్వరం తెల్ల రక్త కణాలు (WBC) ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది ?


డెంగ్యూ ఇన్ఫెక్షన్ ప్రధానంగా వైరస్ సోకిన ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. దోమ కుట్టినప్పుడు, వైరస్ శరీరంలోకి ప్రవేశించి వ్యాప్తి చెందుతుంది. ప్లేట్‌లెట్స్‌లో క్షీణత సంభవించి "థ్రోంబోసైటోపెనియా" అనే పరిస్థితి ఏర్పడుతుంది, ఎముక మజ్జ భాగంలో ఉత్పత్తి అయ్యే యాంటి బాడీస్ ను నిరోధిస్తుంది. డెంగ్యూ వైరస్ రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ ను దెబ్బతీస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తికి 1,50,000 - 4,50,000 ప్లేట్‌లెట్స్ ఉంటాయి. డెంగ్యూ వైరస్ సోకినప్పుడు, ప్లేట్‌లెట్ కౌంట్ 40,000 ప్లేట్‌లెట్స్ కంటే తక్కువకు పడిపోతుంది. ఇది సాధారణంగా 3-4 రోజుల జ్వరంలో సంభవిస్తుంది. 


రక్తంలో ప్లేట్ లెట్స్ ఎలా పెంచుకోవాలి:


ప్లేట్ లెట్స్ భారీగా పడిపోతే, సాధారణ రక్తమార్పిడి ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్‌ పెంచుతారు. సహజంగా మీ ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుకోవడానికి బొప్పాయి ఆకు సారం, ఆకు కూరలు, పండ్లు, ఐరన్-ఉండే ఆహారాలు. విటమిన్ సి,  విటమిన్ కె అధికంగా ఉండే పండ్లు, విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 


చికిత్స ఇదే:


డెంగ్యూ చికిత్సకు నిర్దిష్టమైన ఔషధం లేదు. మీకు డెంగ్యూ జ్వరం సోకినవారు. వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి, పుష్కలంగా నీరు త్రాగాలి. డెంగ్యూ జ్వరంలో, డాక్టర్ సలహా లేకుండా యాంటీ ప్లేట్‌లెట్ మందులు తీసుకోకూడదు. మీకు డెంగ్యూ జ్వరం ఉంటే, డాక్టర్ సలహా లేకుండా మీరు పారాసెటమాల్ మినహా మరే ఇతర ఔషధాన్ని తీసుకోకూడదు. జ్వరం తగ్గిన తర్వాత మొదటి 24 గంటల్లో మీకు అసౌకర్యంగా అనిపించడం ప్రారంభిస్తే, మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.


డెంగ్యూ జ్వరాన్ని ఎలా నివారించాలి?


- ఇంటి లోపల దోమ తెరలను ఉపయోగించండి.


- ఇంట్లో పొడవాటి ప్యాంటు, పొడవాటి చేతుల చొక్కా  సాక్స్ ధరించండి.


- నిద్రించే ప్రదేశంలో స్క్రీన్ లేదా ఎయిర్ కండిషన్ చేయకపోతే, దోమతెరను ఉపయోగించండి.


- పగటి పూట కుట్టే దోమల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నీరు నిలవకుండా ఇంటిని శుభ్రపరుచుకోవాలి.


Also Read : డయాబెటిక్ రెటినోపతి వస్తే చూపు పోతుందా, ఎలా కంట్రోల్ చెయ్యాలి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.