Congress Allotted Kothagudem To Cpi: తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఫైనల్ అయ్యింది. కొత్తగూడెం నుంచి సీపీఐ  పోటీ చేయబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ స్థానంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పారు. అధిష్టానం ఆదేశాలతో సోమవారం మధ్యాహ్నం సీపీఐ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, దీపాదాస్ మూన్షిలు, సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డిలతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం పొత్తులపై రేవంత్ స్పష్టతనిచ్చారు. ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇస్తామని సీపీఐకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ - సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


'ఒప్పందానికి వచ్చాం'


సుదీర్ఘ చర్చల అనంతరం ఒప్పందానికి వచ్చామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని పొత్తులు పెట్టుకున్నామని, ఇక సీపీఎంతోనూ చర్చిస్తున్నామని, అవి కూడా ఫలిస్తాయని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, సీపీఐతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. 


'సీపీఐ గొంతు అసెంబ్లీలో వినిపించాలి'


రాజకీయ అనివార్యత దృష్టితో కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. 'కాంగ్రెస్ ఓ ప్రతిపాదనతో వచ్చింది. సీపీఐ గొంతు అసెంబ్లీలో వినిపించాలి అనేదే మా ఉద్దేశం. రాష్ట్రంలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణ ఉంది. కర్ణాటకలో మాదిరి తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలవాలి. బీఆర్ఎస్, బీజేపీ మంచి మిత్రులుగా మారారు. రాష్ట్ర ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు. నిర్బంధం ఎదుర్కోవడానకి ప్రజలు సిద్ధంగా లేరు. సీపీఎంతో కూడా మైత్రి ఉండేలా చర్చిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


'అప్పుడు నిశ్చితార్థం.. ఇప్పుడు పెళ్లి'


కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు విషయంలో నెల రోజుల క్రితం నిశ్చితార్థం, ఇప్పుడు పెళ్లి జరిగిందని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. 'సీట్లు ఎన్ని ఇచ్చారు అనేది ముఖ్యం కాదు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందాలి. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలి.' అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, అందుకు అనుగుణంగా సీపీఐ మద్దతిచ్చిందని, ఈ స్నేహ బంధం కొనసాగుతందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.


కాగా, సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి స్పష్టత కొరవడిన నేపథ్యంలో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు. 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని చెప్తూ, ఆదివారం 14 మందితో తొలి జాబితా విడుదల చేశారు. అయితే, ఈ జాబితా ఆపాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి, జానారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి ఫోన్ చేశారు. ఇప్పటికే జాబితా ప్రకటించేశామని, జాబితా ఆపడం కుదరదని తమ్మినేని వారికి తేల్చి చెప్పారు. తాజాగా, సీపీఐతో పొత్తు ఫైనల్ అయిన నేపథ్యంలో సీపీఎంతోనూ కాంగ్రెస్ పెద్దలు మళ్లీ చర్చించే అవకాశం ఉంది.


Also Read: Reavnthreddy Nomination: 'కాంగ్రెస్ తోనే తెలంగాణ భవిష్యత్తు' - భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి