విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా ‘విక్రమ్’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఈ చిత్రం ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా కనీవినీ ఎరుగని ఆదరణ దక్కించుకుంది. ఈ సూపర్ హిట్ తర్వాత ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. తాజాగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.
అనౌన్స్ మెంట్ తో అదరగొట్టిన మణిరత్నం
కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రేపు కమల్ హాసన్ తన బర్త్ డే. ఈ సందర్భంగా క్రేజీ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా మూవీకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేవీకి ‘థగ్ లైఫ్’ అని పేరు పెట్టారు.
ఈ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్ కమల్ కనిపించబోతున్నారు. గ్లింప్స్ ఓపెనింగ్ లోనే “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అంటూ మొదలు పెడతారు. కమల్ తలపై ఓ ముసుగు ఉంది. కొందరు కమల్ ను చంపేదుకు దూసుకొస్తారు. వారందరినీ కమల్ మట్టుబెడతారు. సరికొత్త వేషధారణలో కమల్ అదుర్స్ అనిపించారు. ఈ వీడియోలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ అనౌన్స్ మెంట్ వీడియోతో మూవీపై భారీగా అంచనాలు రేకెత్తిస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు నటీనటులు
ఈ సినిమాలో హీరోయిన్‍గా త్రిష హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
35 ఏండ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్న కమల్, మణిరత్నం
ఇక కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‍లో ‘నాయకన్’ అనే సినిమా వచ్చింది. 1987లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రం 'నాయకుడు' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 35 ఏండ్ల తర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.
Read Also: సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial