Delhi Earthquake:



ఢిల్లీలో భూకంపం  


ఢిల్లీలో మరోసారి భూమి తీవ్రంగా కంపించింది. ఇటీవలే నేపాల్‌లో సంభవించిన భూకంప ధాటికి ఢిల్లీలోనూ ప్రభావం కనిపించింది. ఇప్పుడు మరోసారి తీవ్రంగా భూమి కంపించింది. ఇవాళ సాయంత్రం (నవంబర్ 6) 4.18 గంటలకు భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. 






నేపాల్‌లో ఇప్పటికే భూకంపం అలజడి సృష్టించింది. అక్కడ రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైంది. ఆ వెంటనే దేశ రాజధానిలో భూమి కంపించింది. మూడు రోజుల్లోనే రెండు సార్లు భూకంపం నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీతో పాటు NCR ప్రాంతంలోనూ ఈ ప్రభావం కనిపించింది.  నవంబర్ 3న అర్ధరాత్రి 11.30 గంటలకు నేపాల్‌లో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదైంది. అప్పుడు కూడా ఢిల్లీలో ఈ ప్రభావం కనిపించింది. పలు చోట్ల భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ సమయంలో ఢిల్లీతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ భూమి కంపించింది. 






నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపానికి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2015లోనూ నేపాల్‌లో తీవ్ర భూకంపం నమోదైంది. అప్పుడు రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రత నమోదైంది. ఆ ధాటికి అప్పట్లో 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 22 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. National Disaster Management Authority ఎప్పటికప్పుడు భూకంపాలపై అలెర్ట్‌ చేస్తూనే ఉంది. భూమి కంపించినప్పుడు భయపడకుండా టేబుల్‌ కింద దాక్కోవాలని సూచిస్తోంది. భూప్రకంపనలు ఆగిపోయేంత వరకూ అలాగే ఉండాలని చెబుతోంది. నేపాల్‌లో అక్టోబర్ 3, అక్టోబర్ 22, నవంబర్ 3న భూకంపాలు నమోదయ్యాయి. అక్టోబర్ 3 న 4.6 మ్యాగ్నిట్యూడ్‌ నమోదైంది. మిగతా రెండు భూకంపాలు మాత్రం 6.2 తీవ్రతతో అలజడి సృష్టించాయి. జరాకోట్. రుకుమ్ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 157 మంది మృతుల్లో 105 మంది జరాకోట్‌కి చెందిన వాళ్లు కాగా...52 మంది రుకుమ్‌ వాసులు.